● కోర్టులో కేసున్నా బరితెచించిన అక్రమార్కులు
● ఆక్రమణదారులకు అండగా అధికార పార్టీ నేతలు
● కొరడా ఝుళిపించిన రెవెన్యూ అధికారులు
కంచిలి: అంపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో కొందరు అక్రమార్కులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఏకంగా హైకోర్టులో వ్యాజ్యం ఉన్న ప్రభుత్వ భూమిలోనే రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు తెరిచారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈ వ్యవహారానికి ఒడిగట్టారు. దీనికి కొందరు అఽధికార పార్టీ నేతలు అండగా నిలిచారు. దీనిపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝులిపించారు. కొద్ది నెలలుగా వివాదంగా ఉన్న ఈ వ్యవహరంపై తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.
ఎలాగైనా ఆక్రమించాలని..
జాతీయ రహదారికి ఆనుకొని కోట్లాది రూపాయలు చేసే ఈ విలువైన స్థలం పైన కొద్దిరోజులుగా అక్రమార్కుల కన్నుపడింది. కంచిలి మండలం అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బిలో 1.12 ఎకరాల డీ పట్టా భూమిని విచారించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని లోకాయుక్త గత ఏడాది సెప్టెంబరులో తీర్పు వెలువరిచింది. సదరు భూమిపై వివాదాన్ని కొనసాగిస్తూ మరో వ్యక్తి తాను అసలైన వారసుడినంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో వివాదం కొనసాగుతూనే ఉంది. జూన్ 16న దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులు గానీ, ఇతర వ్యక్తులు గాని ఈ వివాదాస్పద భూమిపై ఎటువంటి వ్యవహారాలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుంది. దీన్ని పక్కన పెట్టి కొందరు అక్రమార్కులు ఇటీవల సదరు భూమిని జేసీబీతో చదును చేయించి ఏకంగా వెంచర్ వేశారు. రాళ్లను కూడా పాతిపెట్టి ప్లాట్లుగా విభజించారు. ఈ బరితెగింపు వ్యవహారానికి మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు సూత్రధారులుగా వెనుక ఉంటూ కథ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టకుండా చూసుకొంటానని అక్రమార్కులకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.
చేతుల మారుతూ..
వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం కంచిలి మండలానికి చెందిన అనుపోజు లక్ష్మి అనే మహిళకు రెవెన్యూశాఖ అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని 1.12 ఎకరాల మెట్టు భూమికి బీడీఆర్ పట్టా మంజూరు చేశారు. సదరు భూమి పలు క్రయ విక్రయాల ద్వారా చేతులు మారింది. చివరికి కంచిలికి చెందిన ఒక ప్రభుత్వ అధికారి కొనుగోలు చేశారు. తర్వాత ఆయన మరణించారు. ఆ ఉద్యోగి కుటుంబీకులు ఆ స్థలం ముందు భాగంలో షాపులు నిర్మించారు. తర్వాత ఈ స్థలం సమీపంలో ఓ వ్యక్తి షాపు పెట్టడం, తర్వాత మరికొందరు ఆ భూమి హక్కుదారులు తామే అంటూ ముందుకు రావడం వంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. చివరికి ఈ వివాదం లోకాయుక్త వరకు వెళ్లింది. కేసు విచారణ జరిపిన లోకాయుక్త ఈ భూమి క్రయవిక్రయాలు వ్యవహారంలో జరిగిన మొత్తం గలీజును బయటకు తీసింది. 1987లో బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ద్వారా జరిపిన భూమి బదిలీలు కావడం గుర్తించారు. తర్వాత బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మిగానీ, ఆమె కుటుంబీకులు గానీ ప్రస్తుతం లేనందున సదరు భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కంచిలి తహశీల్దార్‌కు ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. అంతవరకు లోకాయుక్త విచారణ జోలికి పోని, బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ఇంటి పేరుతో ఉన్న ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లి తానే అసలైన వారసుడిని పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఖంగుతున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం కొనసాగుతుండగా మరోవైపు కోట్లాది రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండగా నిలవడంతో ఈ స్థలంలో రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు.
ఆక్రమణ అడ్డగింత..
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంపురం రెవెన్యూ పరిధిలో జాతీ య రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బి లో 1.12 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 27042/2025 వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందున ఆక్రమణదారులు శిక్షార్హులు అంటూ కంచిలి తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ బోర్డు పెట్టారు. అక్కడ స్థలంలో పాతిన రాళ్లను పెకిలించి పక్కన పడేశారు. ఆ స్థలాన్ని పూర్తిగా రెవెన్యూశాఖ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు.


