విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

వరి సాగులో నకిలీలతో జాగ్రత్త

కొనుగోలులో అప్రమత్తత అవసరం

నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి

ఆమదాలవలస: వ్యవసాయంలో అత్యంత ప్రధానమైనది విత్తన ఎంపిక. ఇది పంట దశ, దిశను మార్చుతుంది. విత్తన ఎంపిక, కొనుగోలులలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అన్నదాతకు తీరని నష్టం తప్పదు. ప్రస్తుతం రైతన్నలు ఖరీఫ్‌ వరి సాగుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 23,000 హెక్టార్లలో వరి పండించేందుకు సమాయత్తమవుతున్నారు. దుక్కి దున్ని విత్తనాలు చల్లే పనులకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరి విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని, లేకుంటే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు సొంత విత్తనాలు వాడుతున్నా శుద్ధి చేయడం తప్పనిసరని పేర్కొంటున్నారు.

కొనుగోలులో జాగ్రత్త..

● రైతులు బయట కొనుగోలు చేసే కంటే వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు.

● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను నంబర్‌, గడువు తేదీ, నికర ధర, కంపెనీ పేరు, డీలర్‌ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.

● గడువు దాటిన విత్తనాలు, లూజు, చిరిగి సంచుల నుంచి వచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయకూడదు.

● కొనుగోలు చేసిన సరుకును డీలర్‌ వద్ద తూకం వేయించాలి.

● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని గానీ, శాస్త్రవేత్తలను గానీ సంప్రదించాలి.

● బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొనుగోలు చేసిన వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి.

● చీడ పీడల ఉద్ధృతికి ఏదో రకంగా మందులు పిచికారీ చేస్తుంటారు. అలాకాకుండా శాస్త్రవేత్తల సూచనల మేరకు పురుగు మందులు కొనుగోలు చేయాలి.

● పురుగు మందులు రెండు, మూడింటిని కలిపి వాడకూడదు. వాడిన పురుగు మందు డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి భూమిలో పాతి పెట్టాలి. మెషీన్‌ కుట్టుతో ఉన్న మందుల బ్యాగులనే వాడాలి. ఒకవేళ బ్యాగుకు చేతి కుట్టు ఉంటే సీసం సీలు ఉందో లేదో గమనించాలి.

కంపెనీల ప్రచారంతో మోసపోవద్దు..

పలు మందులు కంపెనీలు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తుంటాయి. ఖరీదైన ఆకర్షణీయమైన కవర్లలో విత్తలు, ఎరువులను ప్యాకింగ్‌ చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి విత్తన ప్యాకెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలపై రసాయన మందులు పిచికారి చేస్తుంటారు. అవి పనిచేయడం లేదని, మరో కంపెనీ మందులు వాడుతుంటారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు పెరిగి ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో అప్పులపాలు కావాల్సి వస్తోంది.

జాగ్రత్తలు తీసుకోవాలి..

విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేయాలి. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఆశపడొద్దు. ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేసేటప్పుడు రశీదులు తప్పకుండా తీసుకోవాలి. మోతాదుకి మించి వాడొద్దు. సరైన విత్తనాల ఎంపికలపైనే పంట దిగుబడులు ఆధారపడతాయి.

– మెట్ట మోహన్‌రావు, వ్యవసాయాధికారి,

ఆమదాలవలస మండలం

Advertisement
 
Advertisement
Advertisement