శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్‌కే సోలార్ టెక్ సొల్యూషన్స్ సంస్థలు 180 ట్రాఫిక్ స్టాపర్స్ (బారికేడ్లు), 25 సోలార్ బ్లింకర్లు సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. వీటిని జిల్లాకేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ తదితర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే కూడళ్లు, మార్కెట్టు ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, ప్రధాన జంక్షన్లు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, వాహనాల పార్కింగ్‌ను నియంత్రించడం, రహదారులపై అనవసర రద్దీని తగ్గించడం, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా పాదచారులు, వృద్ధులు, మహిళల భద్రతకు దోహదపడతాయన్నారు.
ప్రజలకూ బాధ్యత ఉండాలి..
ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటుబెల్టు వినియోగించాలని, మద్యం సేవించి, అతివేగంతో నడపరాదని, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్, ర్యాష్ రైడింగ్ ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌సింగ్, హెచ్‌ఆర్ మేనేజర్ వి.శేఖర్, చీఫ్ మేనేజర్ ప్రసాద్, యూనియన్ జోనల్ సెక్రటరీ వి.వెంకటరమణ, ఆర్‌కే సోలార్ టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఎం.విజయ్‌చంద్, ఎ.చైతన్యప్రభు, ట్రాఫిక్ సీఐ వి.రామారావు, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐ మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


