బడా నేత జోక్యమే కారణమా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలోని బావాజీ మఠం భూములు కళ్ల ముందే ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నంబర్ 121లో ఉన్న భూములు హారతి కర్పూరంలా కబ్జాలతో కరిగిపోతున్నాయి. భూములు ఎవరివి అన్నదానిపై రకరకాల భాష్యాలు చెబుతున్నా.. నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని మాత్రం అధికారులే ధ్రువీకరిస్తున్నారు. సెక్షన్ 22–ఎ(1)(ఈ) కింద నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నమోదై ఉన్నాయని, ఆక్రమించడం కుదరదని అధికార వర్గాలు అంటున్నాయి. సమాధానాలన్నీ అధికారుల దగ్గరే ఉన్నాయి. కానీ కబ్జాకు గురవుతున్న భూములను కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. నిషేధిత జాబితాలోని భూముల్లో లేఅవుట్, ఆపై లావాదేవీలు, దానికి తోడు ప్రభుత్వ నిధులతో ఆ భూముల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంటే చోద్యం చూడటం వెనకున్న రాజకీయ శక్తి ఎవరు? అసలు ఆ భూముల్ని జిల్లా యంత్రాంగం పరిరక్షించలేదా? కలెక్టర్ ఉంటున్న జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూముల్లో జరుగుతున్న కబ్జాలను ఆపలేరా? అంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అక్రమాలకు రాచ‘బాట’
బావాజీ మఠం భూముల వివాదం రోజురోజుకి తీవ్రమవుతోంది. చినికి చినికి గాలివానగా మారినట్టు ఆక్రమణదారులు ఏకంగా తమవే అని సవాల్ విసురుతుంటే.. అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో ఇదే అధికారులు సర్వే నంబర్ 121లో ఉన్నవన్నీ నిషేధిత భూములే అని ఽధ్రువీకరించడమే కాకుండా కలెక్టరేట్ ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదుకు లిఖిత పూర్వక సమాచారం కూడా ఇచ్చారు. నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నిర్ధారిస్తూ, ఆ భూముల్లోకి ఎవరు వెళ్లకూడదని, ఆక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కానీ, వారిచ్చిన నివేదికకు వారే తూట్లు పొడుస్తున్నారు. ఆ సర్వే నంబర్ 121లో తెలుగు తమ్ముళ్లు కొందరు 3.50 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ వేస్తే పట్టించుకోలేదు. ఆ భూములేవైనా అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తే వెంటనే తొలగించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, అక్రమంగా లేవుట్ వేసిన వారి జోలికే వెళ్లలేదు. అక్కడ జరుగుతున్న బాగోతంపై ప్రేక్షక పాత్ర పోషించి చూస్తున్నారు. అలాగని, వదిలేశారా అంటే కాదు. పక్కనున్న కాలనీలకు ఉపయోగపడుతుందని బూచిగా చూపించి లేవుట్‌కు లబ్ధి చేకూరేలా రూ.1.45 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. అంటే, ఆక్రమణదారులకు సహకరిస్తూ రాచబాట వేసినట్టు అయింది.
సవాళ్లు, ప్రతి సవాళ్లు
అసలే అక్రమ లేవుట్... ఆపై సదరు భూములపై వివాదం, జిల్లా, హైకోర్టుల్లో నడుస్తున్న వ్యాజ్యాలు, అధికారులు సైతం నిషేధిత జాబితాలో ఉన్న భూముల ధ్రువీకరణ.. ఇన్ని ఉన్న భూముల్లో ఉపాధి నిధులతో రోడ్లు, కాలువల నిర్మించడం వెనక కారణమేంటి? వెనకున్నదెవరు? బరి తెగించి, కోట్లాది ఉపాధి నిధులు ఉపయోగించడమేంటి? దీనికి అధికారులు బాధ్యులు కారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈ భూములపై సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. బెదిరింపులకు సైతం దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ భూముల పర్య వేక్షణకు సంబంధించిన జగన్నాథ స్వామి మఠం ప్రతినిధులు నేరుగా ఫిర్యాదు చేశారు. మఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, మా భూముల్లో లేఅవుట్ వేసి, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీని వెనక బడా వ్యక్తుల ప్రమేయం ఉందని, మఠం భూ ములను కాపాడాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. గతంలో బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఆక్రమణలకు గురైన వెంటనే, లే అవుట్ వేస్తున్న సమయంలోనే అడ్డుకుని ఉంటే మరో ఫిర్యాదుకు అవకాశం ఉండేదా? కనీసం అధికారులు ఇప్పుడైనా మౌనం విడిచి, చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
బావాజీ మఠం భూములపై చోద్యం చూస్తున్న అఽధికారులు
నిషేధిత జాబితాల్లో ఉన్నాయంటున్న అధికార వర్గాలు
అక్రమ లేఅవుట్, ఆపై అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోని పరిస్థితి
కబ్జాదారులకు వంతపాడేలా చర్యలు
తాజాగా గ్రీవెన్స్‌లో మరో ఫిర్యాదు
ఆక్రమణల నుంచి మఠం భూములు కాపాడాలంటూ వేడుకోలు


