బెధరగొడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

బెధరగొడుతున్నారు

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

● మళ్లీ పెరిగిన ఇంధనం ధరలు

● వారంలో నాలుగుసార్లు పెంపు

● తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.117.50

● డీజిల్‌ ధర రూ.105.15

● సగటున లీటరుపై

రూ.8 పెంపు

● జిల్లా వాసులపై

రోజుకు రూ.16.72 లక్షలు

అదనపు భారం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

పాలకులు సగటు జీవిని బెదరగొడుతున్నారు. మళ్లీ మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి భయం పుట్టిస్తున్నాయి. ముందుగా రూ.3లు పెంచిన కంపెనీలు, తర్వాత మరో 45 పైసలు పెంచాయి. ఇలా వారం రోజుల్లో నాలుగు సార్లుగా సుమారుగా లీటరు డీజిల్‌, పెట్రోల్‌లపై రూ.8లు వరకు పెంచారు. ఇలా రోజూ పెంపు జరుగుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో కొంత రాయితీ ఇచ్చి కొనుగోలుదారులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తోంది.

వారం కిందటి వరకు జిల్లాలో పెట్రోల్‌ లీటరు ధర రూ.109. 46 పైసలు ఉండేది. ప్రస్తుతం లీటర్‌ ధరను రూ.117.50కు పెంచారు. అలాగే డీజిల్‌ లీటరు ధర రూ. 97.26 ఉండేది. దీన్ని రూ.105.15కి పెంచారు. ఇలా రోజువారీ ఈ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది.

జిల్లాలో ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలకు చెందిన బంకులు 143 ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు బంకులు మరో 20 వరకు ఉన్నాయి. సగటున ప్రతి రోజు డీజిల్‌ 1.10 లక్షల లీటర్ల వరకు జిల్లాలో వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం రేటు ప్రకారం లీటరుపై రూ.7.89 పెరిగింది. అంటే సుమారుగా సగటున జిల్లా విని యోగదారులపై రూ.8,67,900లు అదనపు భారం పడుతోంది. అలాగే పెట్రోల్‌ రోజుకి జిల్లాలో సుమారుగా లక్ష లీటర్లు వినియోగం ఉంటుంది. ప్రస్తుతం లీటరుపై రూ.8.04 పెరిగింది. అంటే సగటున రోజుకి రూ.8,04,000 లు అదనపు భారం పడుతోంది. సగటునా జిల్లాలో రోజుకి డీజిల్‌, పెట్రోల్‌ కలిపి వినియోగదారులపై రూ.16,71,900 అదనపు భారం పడుతోంది.

చార్జీలు, ఇతర వసతులపై ప్రభావం

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో వాహనాల ద్వారా రవాణా జరిగే వాటిపై ధరల ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు, నిత్యావసరాలు, వాహన చార్జీలు పెరిగే అవకాశం ఉంది.

హామీ ప్రకారం ధరలు తగ్గించాలి

యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పది రోజుల వ్యవధిలో రూ. 8 వరకూ పెంచింది. ఇది దారుణం. దీని ప్రభావం సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై అధికంగా పడుతుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అప్పటి ధరలపై రాద్ధాంతం చేసింది. తాము అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామని చెప్పింది. ఆ హామీ నిలబెట్టుకోవాలి. – వైశ్యరాజు కేశవరాజు,

మండల పరిషత్‌ విప్‌, నరసన్నపేట

పెట్రోల్‌, డీజల్‌ ధరల్లో తేడాలు ఇలా..

ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా

పెట్రోల్‌ రూ.117.50 రూ.110.48 రూ.7.00

డీజిల్‌ రూ.105.15 రూ.102.19 రూ.3.00

Advertisement
 
Advertisement
Advertisement