అర్హులకు అందేనా..? | - | Sakshi
Sakshi News home page

అర్హులకు అందేనా..?

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

అందరికీ ఇవ్వాలి యంత్ర సాయం అందజేయాలి

అర్హులకు అందజేస్తాం

నరసన్నపేట: వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రతీ పథకం అర్హులకు అందిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. టీడీపీ కార్యకర్తలకే పథకాలు ఇవ్వా లని అనధికారంగా కూటమి ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. గడిచిన 23 నెలలుగా ఇదే జరుగుతోంది. ఈ దశలో రైతులకు యంత్ర సాయం పేరిట ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు ఆశగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4,052 మంది రైతులు దరఖాస్తులు చేశారు. ఈనెల 24తో గడువు ముగిసింది.

అర్హులకు అందేనా..

పంటకోత, నూర్పిడి పరికరాలు 19, మొక్కల సంరక్షణ పరికరాలు 894, పంట కోత అనంతరం ప్రాసెసింగ్‌, విలువ జోడించు యంత్రాలు 18, పవర్‌ టిల్లర్స్‌ 63, అవశేషాల నిర్వహణ/ఎండుగడ్డి, పశుగ్రాసం పరికరాలు 42, స్వీయ చోదక యంత్రాలు 106, విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 14, ట్రాక్టర్‌ పవర్‌ టిల్లర్‌ నడిచే పరికరాలు 129, ట్రాక్టర్లు 43 మొత్తం 1,328 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.84 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అనేక మంది దరఖాస్తులు చేశారు. అయితే అర్హులకు కాకుండా అన్నీ టీడీపీ వారికే ఇచ్చారు. ఇలా ఏ పథకం అమలు చేసినా వారికే ఇస్తున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చేసిన దరఖాస్తులు నిశితంగా పరిశీలించిన అనంతరం.. జేసీ పర్యవేక్షణలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. ఇక్కడే మతలబు ఉంటుంది అని రైతులు అంటున్నారు. లాటరీ పేరున తమకు నచ్చిన వారికి యంత్ర పరికరాలు మంజూరు చేసుకుంటారని అర్హులకు అందవనే అనుమానం బలపడుతోంది. సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగిలిన విభాగాల వారికి 40 శాతం రాయితీపై యంత్రాలు మంజూరు చేస్తారు.

వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి.

– వెలమల రమణ,

కౌలు రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి

రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఈ కూటమి పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి.

– కింతలి చలపతి, రైతు, కానుకర్తివానిపేట

వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలించి జేసీ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులకు యంత్ర పరికరాలు ఇస్తాం. – ఎల్‌వీ మధు,

వ్యవసాయ శాఖ ఏడీ, నరసన్నపేట

యంత్ర సాయం కోసం ఆశగా నమోదు చేసుకున్న రైతులు

లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామంటున్న అధికారులు

అధికార పార్టీ వారికే కట్టబెట్టే వ్యూహమని రైతుల అనుమానం

ముగిసిన దరఖాస్తుల గడువు

ట్రాక్టర్‌తో పొలం దుక్కి చేస్తున్న రైతు

Advertisement
 
Advertisement
Advertisement