వినతులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులను సత్వరమే పరిష్కరించాలి

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

పీజీఆర్‌ఎస్‌కు 143 వినతులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పీజీఆర్‌ఎస్‌కి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ను సోమవారం నిర్వహించారు. అర్జీదారుల నుంచి మొత్తం 143 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్‌డీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

పలు వినతులు పరిశీలిస్తే...

● ఆమదాలవలస మండలం తోటాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 121లో భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని సదావర్తి మఠం (జగన్నాథ దేవాలయం) సేవకుడు పిట్ట మహేశ్వరరావు కోరారు. ఈ భూములు ప్రభుత్వ జాబితాలో 22–ఏ కింద ఉన్నాయన్నారు. అయితే ఆ భూముల్లో రాజకీయ పలుకుబడితో అక్రమ లేఅవుట్‌లు వేసి విక్రయిస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేయాలని విన్నవించారు.

● జిల్లాలో అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు సోమవారం గ్రీవెన్సులో కోరారు. గార మండలం అంపోలు పంచాయతీ ఎరుకు అంబటివానిపేట గ్రామంలో కూటమి నాయకులు చెరువులో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని తెలిపారు.

● తనకు రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల బిల్లులు చెల్లించాలని సరుబుజ్జిలి మండలం తెలుకిపెంట పంచాయతీ పర్వతాలపేట గ్రామానికి చెందిన బెవర మల్లేశ్వరరావు కోరారు. పనులకు సంబంధించిన బిల్లులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

● ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన రైతు ఫిర్యాదు చేశారు. భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement