రాళ్ల గుట్టలో ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

రాళ్ల గుట్టలో ఆక్రమణలు

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

టెక్కలి: జాతీయ రహదారికి ఆనుకుని బొప్పాయిపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 1–1లోని రాళ్లగుట్టలో సుమారు 5 సెంట్ల ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించినప్పటికీ.. తొలగింపు విషయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జోక్యం చేసుకుని అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. ఇదే రాళ్లగుట్టకు ఆనుకుని జాతీయ రహదారి వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో దీని విలువ పెరగడంతో ఆక్రమణలు మరింత జోరందుకున్నాయి. వీటితో పాటు సమీపంలో సుమారు ఎకరా వరకు డీ–పట్టా స్థలం ఉంది. దీనిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు అమ్మకాలు చేపట్టడంతో రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. కాగా జాతీయ రహదారికి అనుకుని బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ స్థలాల్లో ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా వీటి విలువ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో పంచాయతీ స్థాయిలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తల కన్ను పడింది. ఎలాగైనా వాటిని కై వసం చేసుకుని గుట్టుగా అమ్మకాలు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అందువలన ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement