వీధి మధ్యలో బోర్‌వెల్‌ | - | Sakshi
Sakshi News home page

వీధి మధ్యలో బోర్‌వెల్‌

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

పలాస: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పలాస బజారు వీధికి వెళ్లే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే ఆ రోడ్డులోని కొత్వాల్‌ వీధి మధ్యలో ఒక వ్యక్తి తన సొంత అవసరాల కోసం బోరువెల్‌ వేయించుకుంటున్నాడు. తన అవసరం కోసం ఎక్కడైనా బోర్‌వెల్‌ మున్సిపాలిటీ అధికారుల అనుమతితో వేసుకోవచ్చు. అయితే కోత్వాల్‌ వీధిలో రోడ్డుకు మధ్యన బోర్‌వెల్‌ను సోమవారం వేయించాడు. దీంతో ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్‌ అయింది. రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డు మధ్యలో బోరు వేయడమేంటని, ఇది ప్రజలకు చాలా ఇబ్బందని మున్సిపల్‌ కమిషనర్‌కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశామని, అతను కూడా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ప్రేమ జంటను రక్షించిన శక్తి టీమ్‌

ఆమదాలవలస: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంటను శక్తి టీమ్‌ పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మన్యం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన వీరు గత నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసినప్పటికీ.. వారు అంగీకరించకపోవడంతో ఈనెల 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో తీవ్ర నిరాశకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం ఆమదాలవలస రైల్వే పట్టాలపై నిల్చున్నారు. అదే సమయంలో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న శక్తి టీమ్‌ ఇన్‌చార్జి ఉమెన్‌ హెచ్‌సీ తమ్మినేని అమ్మాజీ, మహిళా కానిస్టేబుల్‌ ధనలక్ష్మి వారిని గమనించి, వెంటనే అప్రమత్తమై రక్షించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తెలియజేసి, ప్రేమ జంటను పాలకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన శక్తి టీమ్‌ సిబ్బందిని జిల్లా పోలీసు యంత్రాంగం అభినందించింది.

Advertisement
 
Advertisement
Advertisement