● పంచాయతీ రిజర్వు స్థలంలో టీడీపీ నాయకుడి ఇంటి నిర్మాణం
● అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై పోలీసులకు ఫిర్యాదు
గార: విలువైన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటున్న ఘటనలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. మండలంలో శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబరు 600లో 0.12 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని పంచాయతీ తీర్మానం ద్వారా గత ప్రభుత్వం శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూరప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్‌కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. అప్పట్లో స్థానికుడు రిజర్వు స్థలంలో తనకు కొంత భూమి ఉందని కోర్టుకు వెళ్లగా, ఆ స్థలమంతా పంచాయతీ రిజర్వు స్థలమని తీర్పు వచ్చింది. అయితే అనంతరం ఎన్నికలు రావడంతో ఆదిలీలా ఫౌండేషన్ పనులు ప్రారంభించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుడు పొజిషన్ సర్టిఫికెట్ తెచ్చుకొని నిర్మాణ పనులను మొదలుపెట్టాడు. వీరికి నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం ఉండడంతో అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గతేడాది పనులు ప్రారంభించగా సాక్షితో పాటు పలు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసులిచ్చి పనులు నిలిపేశారు. మరలా గత నెల 14వ తేదీన పనులు చేపట్టడంతో స్థానికులు వెళ్లి పనులు ఆపేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల గత రెండు రోజులుగా పనులు చేపట్టడంతో సోమవారం స్థానికులు మరలా వెళ్లి పనులు ఆపమని చెప్పారు. అయితే స్థానికులు తమపై దాడి చేశారంటూ నిర్మాణ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు ఆపమని చెప్పడం కూడా ఈ ప్రభుత్వంలో తప్పేనా అంటూ గ్రామస్తుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


