● మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
అంటున్న శాస్త్రవేత్తలు
● జిల్లాలో 40డిగ్రీలకు పైబడిన ఉష్ణోగతలు
ఎండ తీవ్రతతో ఆమదాలవలసలో నిర్మానుష్యంగా ఉన్న రహదారి
ఆమదాలవలస: జిల్లాలో భానుడు భగభగలాడుతూ ప్రతాపం చూపుతున్నాడు. గత 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో వీచిన చల్లగాలులు కాస్త జిల్లా ప్రజలకు ఊరటనిచ్చాయి. అయితే ఆదివారం మళ్లీ జిల్లాలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో 40 డిగ్రీలకు ఉష్ణోగత చేరుకుంది. ఉక్కపోతతో తమ ఇళ్లలో ఉండ లేక, బయట తిరగలేక నానా ఇక్కట్లు పడ్డారు.
నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే వరకు ఎండ తీవ్రత కొనసాగక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్ర భావంతో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపారు.అలాగే మరో రెండు రోజుల్లో రోహిణీ కార్తెలు రాబోతున్నాయని దీంతో మరింత ఎండ ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు చెబుతున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇన్ని రోజుల పాటు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. శ్రీకాకుళం, రణస్థలం, పాతపట్నం, ఆమదాలవలస, కొత్తూరు ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పెరిగిన తేమశాతం
వాతావరణంలో వారం రోజులుగా భారీ మార్పు లు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 60–65 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 70–75 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


