రోడ్డు చెంతనే తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు చెంతనే తవ్వకాలు

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

ప్ర‘జల’ బాధలు పట్టవా..?

హిరమండలం: వంశధార పనుల పేరుతో కాంట్రాక్టర్లు లోకొండ గిరిజన గ్రామం రహదారిని ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల వంశధార ఎత్తిపోతలు, కరకట్టలు, ఇతరత్రా నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కంకర, మట్టి అవసరం. ఇదే అదనుగా లోకొండలో వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాల్లో కంకర, మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. అయితే రహదారి చెంతనే, కల్వర్టుల వద్ద తవ్వకాలు చేపడుతుండడంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. 2022లో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఇది కేవలం ద్విచక్ర వా హనాలతో పాటు చిన్నపాటి వాహనాలు నడిపేందుకు సామర్థ్యం ఉన్న రోడ్డు మాత్రమే. అయితే రహదారికి ఆనించి మట్టి, కంకర తవ్వకాలతో పూర్తిగా బలహీనం అవుతోంది. ఆపై భారీ వాహనాలు రోడ్డుపై వెళుతుండడంతో పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఇదేమని అడుగుతుంటే సంబంధిత కాంట్రాక్టర్లు వంశధార పనుల పేరు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రహదారి మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని లోకొండ గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వడదెబ్బతో మాజీ ఎంపీటీసీ మృతి

గార: అంపోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంబటి తౌడు (77) వడదెబ్బతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం తౌడు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి వద్దనే అస్వస్థతకు గురయ్యారని, కొద్ది నిమిషాల్లో మృతి చెందారని తెలిపారు. తౌడు మృతిపై వైఎస్సార్‌ సీపీ స్టేట్‌ ఎస్‌ఈసీ మెంబర్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గొండు రఘురాం, మాజీ సర్పంచ్‌ గొండు జయరాం సంతాపాన్ని తెలియజేశారు.

వజ్రపుకొత్తూరు: మండువేసవిలో చుక్కనీరు దొరక్క చాలా చోట్ల ప్రజలు అల్లాడిపోతుండగా.. మరికొన్నిచోట్ల మాత్రం వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే లేదు. కొండవూరులో జలజీవన్‌ మిషన్‌ ద్వారా పంపిణీ చేస్తున్న శుద్ధ జలాలు వృథా అవుతున్నాయి. రోజూ వందల లీటర్ల నీరు కుళాయిల ద్వారా వృథాగా పోతున్నా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. పక్కనే ఆ పథకం ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉండడంతో నిత్యం కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ట్యాప్‌లు సక్రమంగా అమర్చక పోవడంతో నీరంతా వృథా అవుతుంది. కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ట్యాప్‌లను బాగు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement