థైరాయిడ్‌! | - | Sakshi
Sakshi News home page

థైరాయిడ్‌!

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

వామ్మో.. థైరాయిడ్‌! ● జిల్లాలో ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య ● కీళ్లనొప్పులు, డిప్రెషన్‌, ఊబకాయంతో సతమతం ● నేడు ప్రపంచ థైరాయిడ్‌ డే

గర్భిణులు జాగ్రత్త..

త్వరగా గుర్తిస్తే మేలు

వామ్మో..
● జిల్లాలో ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య ● కీళ్లనొప్పులు, డిప్రెషన్‌, ఊబకాయంతో సతమతం ● నేడు ప్రపంచ థైరాయిడ్‌ డే

ఇచ్ఛాపురం రూరల్‌: కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్‌ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్‌ థైరాయిడ్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

ఈ లక్షణాలు కనిపిస్తే..

థైరాయిడ్‌లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్‌ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్‌ నోడ్యూల్స్‌, గాయిటర్‌ (థైరాయిడ్‌ గ్రంథి వాపు), థైరాయిడ్‌ క్యాన్సర్‌ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్‌, మలబద్ధకం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్‌ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్‌ లేదా నోడ్యూల్స్‌ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్‌ అవసరం లేదు. క్యాన్సర్‌గా మారితేనే ఆపరేషన్‌ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్‌ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్‌ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది.

కారణాలు..

థైరాయిడ్‌ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్‌ వ్యాధి వస్తుంది. హైపోథైరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్‌ రుగ్మతలు, అయోడిన్‌ లోపం, థైరాయిడ్‌ శస్త్రచికిత్స, రేడియేషన్‌ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్‌ థైరాయిడిజం గ్రేవ్స్‌ డిసీజ్‌, థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్‌ సమస్యలకు కారణం. అయోడిన్‌ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు.

నివారణ ఇలా..

థైరాయిడ్‌ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్‌, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్‌ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోథైరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్‌ వంటి హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ, హైపర్‌ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్‌ మందులు, రేడియో అయోడిన్‌ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్‌ గానీ అవసరం కావచ్చు

మహిళల్లోనే అధికం..

మహిళల్లో థైరాయిడ్‌ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయిలు థైరాయిడ్‌ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్‌ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్‌సీలో థైరాయిడ్‌ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.

థైరాయిడ్‌ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్‌ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం.

– డాక్టర్‌ ఎ.రమ్యారెడ్డి,

వైద్యాధికారి, ఈదుపురం

సమాజంలో 11 శాతం మందిలో హైపోథైరాయిడ్‌, రెండు శాతం మందిలో హైపర్‌ థైరాయిడ్‌ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి.

– డాక్టర్‌ దల్లి సురేష్‌రెడ్డి, ఎండీ, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌, ఇచ్ఛాపురం

Advertisement
 
Advertisement
Advertisement