అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. జ్యేష్ట మాసం రెండో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తలనీలాలను సమర్పించుకుంటే, మరికొందరు 108 సార్లు ప్రదక్షిణలు, సంప్రదాయ పూజలు, వెండి కళ్లు, బంగారు కళ్లు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు, రూ.300 దర్శన టికెట్లతో అంతరాలయ దర్శనాలు కల్పించారు. ఆలయం బయట ఎండ నుంచి రక్షణగా టెంట్లు వేయగా, మంచినీటి కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. అన్నదాన ప్రసాదం కోసం భక్తులు వేచి ఉండక తప్పలేదు.. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పలువురికి అన్నదాన ప్రసాదం అందని పరిస్థితి నెలకొంది.


