ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ఆదేశాలతో గతంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు పింఛన్ తొలగింపు హైకోర్టు తీర్పుతో మళ్లీ పింఛన్ల పునరుద్ధరణ ఇచ్ఛాపురంలో రాజకీయ కక్షలపై న్యాయస్థానం చురకలు ఆనందంలో బాధిత పింఛన్‌దారులు
కోర్టు తీర్పును అమలు
పరుస్తాం
రాజకీయ పక్షపాతానికి
పచ్చపాతకంపై కోర్టు ఉక్కుపాదం
తన మన బేధం చూపకుండా సంక్షేమం అందించడం నాయకుడి లక్షణం. గెలిచాక రాజకీయ భేదాలు పక్కన పెట్టి సామాన్యులకు సేవ చేయడం ప్రజా ప్రతినిధి కర్తవ్యం. కానీ ఇచ్ఛాపురంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. సాక్షాత్తు అక్కడి ఎమ్మెల్యే కొందరి పింఛన్లను ఆపేయాలని ఆదేశించారు. ఆ కాసిన్ని డబ్బులు వారి చేతిలో పడకుండా అడ్డుకున్నారు. కానీ ఆఖరకు న్యాయమే గెలిచింది. హైకోర్టుకు వెళ్లిన బాధితులు తమ పింఛన్లను తిరిగి పునరుద్ధరించుకున్నారు.
నా పేరు పేరు దల్లి రామకృష్ణ. మాది మశాఖపురం గ్రామం.మూడేళ్ల క్రితం అనారోగ్యం బారినపడి నరాలు చచ్చుబడటంతో దివ్యాంగుడియ్యాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వికలాంగుల పింఛన్ మంజూరైంది. నేను ఇక్కడి వాడినే అయినా ఒడిశాకు చెందిన వాడిని అంటూ స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అశోక్‌కు ఫిర్యాదు చేసి పింఛన్ నిలిపివేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మా తరఫున న్యాయ పోరాటం చేసి పింఛన్ పునరుద్ధరణకు కృషి చేశారు.
నా పేరు బాకి కురమ్మ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నాకు వితంతు పింఛన్ మంజూరు చేయగా, వైఎస్సార్ సీపీకి ఓటు వేశానన్న నెపంతో ఒడిశాకు చెందిన మహిళా అంటూ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అశోక్‌కు నాపై ఫిర్యాదుచేసి పింఛన్ ఆపేశారు. మా గ్రామానికి చెందిన నడిరెడ్ల చిరంజీవి, రంగాల జానీ తదితరులు కృషితో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
నా పేరు కన్నిండి మోహినమ్మ. పన్నెండేళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి నాకు వితంతు పింఛన్ వస్తోంది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశాననే నెపంతో నేను ఒడిశాకు చెందిన మహిళా అంటూ పింఛన్ నిలిపివేశారు. ఆంధ్రా రాష్ట్ర, శ్రీకాకుళం జిల్లా, మశాఖపురం గ్రామవాసిగా అన్ని అర్హతులు చూపించినప్పటికీ అధికారులు కనికరించలేదు. ఇప్పుడు న్యాయం గెలిచింది.
ఒంటరి మహిళ పింఛన్ పొందుతున్న నాపేరు అర్తికట్ల లోలమ్మ. నా కుమార్తె చామంతికి పెళ్లిచేసి అత్తారింటికి పంపించాను. అయితే నా కుమార్తె చామంతి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. రాజకీయ కక్షతో నా పింఛన్ ఆపేశారు. దేవుడు ఉన్నాడు, ఒంటరి మహిళైన నన్ను ఆదుకునేందుకు న్యాయం గెలిచింది.
ఇచ్ఛాపురం రూరల్:
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పేదలే గెలిచారు. రాజకీయ కక్షతో నేతలు వారి పింఛన్లను ఆపేసినా హైకోర్టు వరకు వెళ్లి తమ హక్కును దక్కించుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతల ఆధారంగా ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామానికి చెందిన బాకి కురమ్మ(వితంతువు), దల్లి రామకృష్ణ(దివ్యాంగుడు), ఆశి దాలమ్మ(ఒంటరి మహిళ), కన్నిండి మోహినమ్మ(వితంతువు), అర్తికట్లు లోలమ్మ(ఒంటరి మహిళ)లకు సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేశారు. ఎన్నికల అనంతరం అధికార మార్పు తర్వాత రాజకీయ కారణాలతో వీరంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు అంటూ స్థానిక సర్పంచ్ వినతి మేరకు అప్పటి ఎంపీడీఓ ఐదుగురు పింఛన్ దారులకు 2024 ఆగస్టు 28న నోటీసులు జారీ చేశారు.
అధికారుల చుట్టూ తిరిగి..
పింఛన్లు కోల్పోయిన వారంతా దీనులు. అర్హతా పత్రాలతో పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించలేదు. అధికారులు కూడా ‘ఎమ్మెల్యే వద్దకు వెళ్లి బతిమాలండి’ అంటూ సలహా ఇచ్చారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
అనర్హతలను నిర్ధారించే సరైన విచారణ లేకుండానే పింఛన్లు నిలిపివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టినట్లు సమాచారం. సంక్షేమ పథకాలను రాజకీయ కోణంలో చూడకూడదని, పేదల హక్కులను హరించేలా వ్యవహరించడం సరికాదని అధికారులకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఐదు మంది లబ్ధిదారులకు సంబంధించి 12 వారాల్లోగా పెండింగ్ పింఛన్లను చెల్లించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు, ఇచ్ఛాపురం మండలాభివృద్ధి అధికారికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్ పేదల పింఛన్లు ఆపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముగిసి అధికారం దక్కాక కూడా రాజకీయాలు చేయడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పు అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వ్యవహార శైలికి చెంప పెట్టులా మారిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.
మశాఖపురం గ్రామానికి చెందిన ఐదు మంది పింఛన్‌దారులు గతంలో పింఛన్ పొందేవారని తెలుస్తోంది. అన్యాయంగా పింఛన్ తొలగించారంటూ న్యాయం స్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పును గౌరవిస్తూ, అమలుపరుస్తాం. అయితే ప్రస్తుత సమస్య నా పరిధిలో లేకపోవడంతో మాపై ఉన్నతాధికారులు సూచనలు మేరకు చర్యలు తీసుకుంటాం.
– ఎ.ప్రభాకరరావు, ఎంపీడీఓ, ఇచ్ఛాపురం
‘పింఛన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం
కాదని, గౌరవంగా జీవితాన్ని కొనసాగించే సామాజిక భద్రత హక్కు అని, సామాజిక సంక్షేమ పింఛను పథకాల ప్రధాన ఉద్దేశం, నిరుపేదలు, బలహీన తరగతులకు ఆర్థిక ఆసరా కల్పించడమే’ అంటూ హైకోర్టు
వ్యాఖ్యానించింది.
‘మీరు మీ పింఛన్ అర్హతను తగు ఆధారాలతో 2024 ఆగస్టు 30న హాజరై పత్రాలు
సమర్పించాలని, 2024 ఆగస్టు14న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ లేఖ ద్వారా
ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీకు
నోటీసులు జారీ చేస్తున్నాం’ అంటూ
2024 ఆగస్టు నుంచి పింఛన్లు ఆపేశారు.


