ఇసుక బళ్లు ఆపుతారా.. లేదా..? | - | Sakshi
Sakshi News home page

ఇసుక బళ్లు ఆపుతారా.. లేదా..?

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

ఇసుక బళ్లు ఆపుతారా.. లేదా..? ● భారీ ఆందోళన చేపట్టిన బావాజీపేట వాసులు

శ్రీకాకుళం పాత బస్టాండ్‌ : దూసి, ముద్దాడ పేట అక్రమ ఇసుక క్వారీల ద్వారా భారీ వాహనాలతో విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళుతున్న భారీ ఇసుక వాహనాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాగోలు పంచాయతీ బావాజీ పేట గ్రామ ప్రజలు దూసి–రాగోలు రోడ్డు మధ్యలో ఉన్న బావాజీపేట జంక్షన్‌ వద్ద శనివారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రెండేళ్లుగా ఇసుక వాహనాలు తిరుగుతుండడంతో దారి ధ్వంసమైందని వారంతా వాపోయారు. పాడైన రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ ఇసుకతో కోట్లు గడిస్తున్న నాయకులు రోడ్లను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదిసార్లు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశా మని తెలిపారు. ప్రతి రోజు వందలాది పెద్ద లారీలు ఈ రోడ్డు మీదుగా వెళ్లడం వల్ల ధూళి విపరీతంగా వస్తుందని, రోడ్డంతా గోతులుగా మారిందని వారు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, పాడైపోయిన రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాతో దూసి, ముద్దాడ పేట గ్రామాల నుంచి వస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు రహదారిపై నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement