శ్రీకాకుళం న్యూకాలనీ : క్రీడా పాఠశాలల పిలుస్తోంది. చదువుతూ క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వైఎస్సార్ హయాంలో..
ప్రతిభ కలిగిన పేదవారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంతోపాటు కడపలో స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ స్కూల్లో చదివిన విద్యార్థులు వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఎంతో మంది ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి వెళ్లారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొంది రాణిస్తున్నారు.
జూన్ 2 వరకు గడువు..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను మే 19 నుంచి జూన్ 2వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 75 సీట్లకుగాను 4వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయి. బాలురుకు 20, బాలికలకు 20 ఉంటాయి. 5వ తరగతిలో మొత్తం 23 సీట్లకు గాను బాలురు 6, బాలికలు 17 మంది, 8 తరగతిలో 12 సీట్లకుగాను బాలురు 4, బాలికలను 8 మందిని క్రీడా పాఠశాలకు తీసుకుంటారు.
ఎవరు అర్హులంటే..
● 4వ తరగతిలో ప్రవేశానికి మూడవ తరగతి పూర్తి చేసి 8 నుంచి 10 ఏళ్లలోపు ఉండాలి.
● 5వ తరగతి అభ్యర్థులు 4వ తరగతి పూర్తి చేసి 9 నుంచి 11 ఏళ్ల లోపు ఉండాలి.
● 6 తరగతిలో ప్రవేశానికి 5వ తరగతి పూర్తి చేసి 10 నుంచి 12 ఏళ్ల లోపు ఉండాలి.
● తెలుపు రేషన్ కార్డు కలిగి ఉండాలి.
షెడ్యూల్ ఇదే..
జిల్లాస్థాయి ఎంపికలు జూన్ 7, 8 తేదీల్లో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న జాబితాను విడుదల చేస్తారు. జూన్ 11న ఎంపికై న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు సమాచారం అందిస్తారు. జూన్ 14, 15 తేదీల్లో కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి.
ఎంపికల్లో జరిగే టెస్టులు ఇవే...
క్రీడా పాఠశాల ఎంపికలకు విద్యార్థులకు మొత్తం 9 రకాల టెస్టులను నిర్వహించనున్నారు. ఇందులో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, మెడిసిన్ త్రోబాల్, 800 మీటర్ల పరుతో పాటు వివిధ టెస్టులు నిర్వహిస్తారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన పేద క్రీడాకారులకు గొప్ప అవకాశమని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు సూచిస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
జూన్ 7, 8 తేదీల్లో శ్రీకాకుళంలో జిల్లా స్థాయి ఎంపికలు
చదువుతూ క్రీడల్లో రాణించేందుకు గొప్ప అవకాశం


