ఆమె నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

ఆమె నేత్రాలు సజీవం

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

శ్రీకాకుళం కల్చరల్‌: గుజరాతిపేటకు చెందిన సూర సరస్వతమ్మ (72) మృతి చెందడంతో ఆమే నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌కె శ్రీనివాస్‌, పి.వైకుంఠరావు, కూన భాస్కరరావు నిర్ణయించుకొని నేత్రదాన మోటివేటర్‌ మల్లా కళ్యాణ్‌ చక్రవర్తి ద్వారా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్‌ పూతి సుజాత, నంది ఉమాశంకర్‌ల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్‌.వి.ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతలు 78426 99321 నంబరుకు సంప్రదించాలని వారు కోరారు.

మందస పోస్టుమాస్టర్‌కు అవార్డు

మందస: మందస మండల పోస్టుమాస్టర్‌ దాసరి భాస్కరరావు 2025–26 సంవత్సరంలో శ్రీకాకుళం పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో 2,279 పొదుపు ఖాతాలు తెరిపించి ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తిపై నిబద్ధత, కార్యాచరణ, ప్రజలకు సేవలు అందించడంతో ఈ అవార్డు వరించింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ చేతుల మీదుగా భాస్కరరావు అవార్డుఅందుకున్నారు.

కల్వర్టును ఢీకొని వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామానికి చెందిన కేశవరపు చరణ్‌ సతీష్‌ నాగేంద్ర(35) తన వ్యాన్‌లో కటక్‌ నుంచి పాలకొల్లు వైపు వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో గరీబుల గెడ్డ వద్దకు వచ్చేసరికి నిద్రలోకి జారుకోవడంతో సమీపంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కోటబొమ్మాళి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

బూర్జ: చీడివలస గ్రామానికి చెందిన రామానుజ అప్పారావు(80) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మనస్తాపం చెంది ఈ నెల 22న పశువుల శాలలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుమారుడు రామానుజ సింహాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక తెలిపారు.

ఉరి వేసుకుని ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు రూరల్‌: నువ్వలరేవు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బెహరా కేశవ(36) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కేవశ ఆటోను నడుపుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య బెహరా హిమలతో గొడవపడుతుండేవాడు. ఉదయం 6 గంటల సమయంలో భార్య హిమల స్నానానికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి కేశవ ఇంట్లో ఉన్న సిలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నాడు. తల్లి యర్రమ్మ గమనించి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొలీసులు తెలిపారు. కేశవకు కుమార్తె జ్యోతి, కుమారుడు ఢిల్లేశ్వరరావు ఉన్నారు.

వడదెబ్బతో యాచకుడు మృతి

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లాకేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ సమీపంలో మెడికల్‌ సెంటర్‌ వద్ద ఓ యాచకుడు వడదెబ్బతో శనివారం మృతిచెందాడు. డయల్‌ 112కి వచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లేసరికి యాచకుడు మృతిచెంది ఉన్నాడని, వడదెబ్బ తగలడంతోనే ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement