● శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రూ.17 లక్షలతో ఏర్పాటు
● జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నేడు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. క్రీడాకారులు రాణించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు, వసతులను సమకూర్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మహిళా క్రికెట్ ఉన్నతి కోసం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో రూ.11లక్షల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాలికలు వేసవి క్రీడా శిక్షణా శిబిరాల పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులో కఠోర సాధన చేస్తున్నారు. పురుషుల కోసం అత్యాధుని సదుపాయాలతో క్రికెట్ నెట్స్‌ను ఏర్పాటు చేశారు.
రూ.17 లక్షల నిధులతో నెట్స్..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్‌ఐఓ ఆఫీసు, జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయానికి ఆనుకుని సుమారు రూ.17 లక్షల నిధులతో అత్యాధునిక హంగులతో క్రికెట్ నెట్స్‌ను ఏర్పాటు చేశారు. పురుషుల కోసం ఫ్లడ్‌లైట్ల వెలుతురుతో, అత్యధిక రనప్‌తో కూడిన నాలుగు వికెట్లను నిర్మించారు. ఇందులో రెండు టర్ఫ్ వికెట్లు, ఒక యాస్ట్రో టర్ప్ వికెట్, మరొక సిమెంట్ వికెట్ కూడా ఉంది. ఇతరులు లోపలికి ప్రవేశించకుండా ఇనుప రాడ్లు, చువ్వలతో కంచెను ఏర్పాటు చేశారు. ఫ్లోరింగ్‌కు టైల్స్‌తోపాటు సరికొత్తగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్వరలో జిమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని జెడ్‌సీఎస్ యోచిస్తున్నారు.
నేడు క్రీడాకారులకు అందుబాటులోకి..
జిల్లా కేంద్రంలో పురుషుల కోసం ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్‌ను క్రీడాకారుల సాధన కోసం అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఆదివారం మద్యాహ్నం ఈ నెట్స్ ప్రారంభోత్సానికి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్‌తోపాటు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరరెడ్డి, ఏసీఏ ప్రతినిధులు తదతరులు హాజరుకాన్నట్టు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి హసన్‌రాజా షేక్, కోశాధికారి మదినీ శైలానీ, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్ తెలిపారు. త్వరలో శిక్షణకు వచ్చే క్రీడాకారులకు ఐడీ కార్డులు అందిస్తామని చెప్పారు.


