శ్రీకాకుళం: విద్యార్థుల అభ్యసన స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పప్పల వేణుగోపాల్‌లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.కేశవరావు, బాడాన రాజు మాట్లాడుతూ ఇతర సబ్జెక్టులతో పోల్చితే అన్ని తరగతులలో విద్యార్థుల పాలిట పెనుభారంగా మారిన సాంఘిక శాస్త్ర సిలబస్‌ను తగ్గించాలని కోరారు. 6వ తరగతిలో 16 పాఠాలు, 7వ తరగతిలో 22 పాఠాలు, 8వ తరగతిలో 16 పాఠాలు, 9వ తరగతిలో 20 పాఠాలు, 10వ తరగతిలో 22 పాఠాలుతో మొత్తం 2553 పేజీలను ఒకే ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. సీబీఎస్‌ఈ అమలులో ఉన్న రాష్ట్రాలలో సాంఘిక శాస్త్ర బోధనకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడాన్ని వారు గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పబ్లిక్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఆర్.అన్నాజీ రావు, సుబ్రహ్మణ్యం, మూర్తి, టి.రమణ, రామారావు, ఈశ్వర రావు, ధనలక్ష్మి, లక్ష్మణ రావు, సుధాకర్, సూర్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


