బాబుగారూ.. ఇదేనా చెత్తశుద్ధి! | - | Sakshi
Sakshi News home page

బాబుగారూ.. ఇదేనా చెత్తశుద్ధి!

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

2018లో టీడీపీ హయాంలో రూ.27లక్షలతో ఈ కేంద్రాన్ని నిర్మించి నానా హడావుడి చేశారు. అప్పట్లోనూ ప్రారంభించాక గాలికొదిలేశారు. దాని నుంచి పైసా ఆదాయం రాలేదు. తాజాగా స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర పేరుతో మళ్లీ అదే కేంద్రానికి రూ.60లక్షలు ఖర్చు పెట్టి హంగులు సమకూర్చారు. అంతటితో ఆగకుండా ఈ నెల 16న సీఎం అక్కడికొచ్చి సందర్శించి ఫొటోలకు పోజులిచ్చారు. అక్కడొక పెద్ద సినిమా సెట్టింగే ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి, వారితో చంద్రబాబు మాట్లాడి, సినిమాటిక్‌ తరహాలో తెగ హడావుడి చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన పరికరాలు, కార్మికులు, ఇతర సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి, వారి నుంచి ఏదో తెలుసుకున్నట్టు లైవ్‌ కవరేజ్‌లో తెగ పబ్లిసిటీ చేసుకున్నారు.

సీఎం వెళ్లారు..తాళం వేశారు

హమ్మయ్యా.. చెత్తనుంచి సంపద సృష్టిస్తారని, ఇక ఆదాయం రావడమే తరువాయి అని అంతా భావించారు. కానీ, ఆ ఆనందం, ఆశలు వెంటనే ఆవిరైపోయాయి. చంద్రబాబు ఇలా వెళ్లగానే అలా మూతపడి పోయింది. ఇప్పుడైతే ఏకంగా తాళం వేసి ఉండటంతో సీఎం పర్యటనతో ప్రత్యేకతను సంతరించుకున్న చెత్త నుంచి సంపద కేంద్రం ఏరియా నిర్మానుష్యమైపోయింది.

చంద్రబాబు తీరే అంత..

చంద్రబాబు ఏం చేసినా దానికి ప్రచారం కావాలి. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. పర్యటన అయ్యాక ప్యాకప్‌ చేసేయాలి. అటువంటి ఆలోచన ధోరణితోనే కార్యక్రమాలు చేపడతారు. తాత్కాలిక ఆర్భాటం కోసం హడావుడే తప్ప శాశ్వత అభివృద్ధి అనేది ఆయన హిస్టరీలోనే లేదు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ ఆయన చేసిన అభివృద్ధి, వేసిన మార్క్‌ అనేది లేకపోవడానికి కారణం ఇదే. ఎంత సేపూ ప్రజల డబ్బుతో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చిందేమీ ఉండదు. అనుయాయులు నాలుగు కాసులు సంపాదించుకోవడానికి చేసే పనులే తప్ప ప్రజలకు, జిల్లాకు మేలు చేసేదేమి ఉండదనేది ఇప్పటికి అనేక సార్లు చూశాం. తాజాగా రూ.60 లక్షలతో హంగులు ఏర్పాటు చేసి, పరిశీలన చేసిన చెత్త నుంచి సంపద కేంద్రం కూడా అలాగే తయారైంది.

ఈ ఫొటోలో ఉన్నది ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకొచ్చి సందర్శించిన నరసన్నపేటలోని సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం(చెత్త నుంచి సంపద కేంద్రం). ప్రస్తుతం మూతపడి ఉంది. దాదాపు రూ.60 లక్షలు ఖర్చు పెట్టి చంద్రబాబు పరిశీలన కోసం సుందరంగా తీర్చిదిద్దిన కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. ఆయన జిల్లా నుంచి వెళ్లిపోయాక తాళాలు వేసేశారు. చంద్రబాబు హయాంలో ఆర్భాటం ఎలా ఉంటుందో.. పర్యటన ముగిసాక ఏం జరుగుతుందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమిది. పబ్లిసిటీ తప్ప ‘చెత్త’ శుద్ధి లేదనడానికి ఇదొక నిదర్శనం.

నరసన్నపేటలో చెత్త సంపద కేంద్రం తాళాలు తీస్తే ఒట్టు

సీఎం చంద్రబాబు వెళ్లిపోయాక మూసివేత

రూ.60 లక్షలతో పరిశీలన కోసం హంగులు

అనుకున్న పబ్లిసిటీ వచ్చాక మూత

విస్తుపోతున్న ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement