● ఒకేరోజు భిన్నవాతావరణం
● పగలంతా భానుడి భగభగలు
● రాత్రి గాలివాన బీభత్సం
● పిడుగులతో బెంబేలెత్తిన జిల్లా వాసులు
ఆమదాలవలస :
భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేక, బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే వరకు ఎండ తీవ్రత కొనసాగక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని చెబుతున్నారు.
ఆర్టీసీ కండక్టర్‌కు వడదెబ్బ
సారవకోట: పాతపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ డీఎం రావు శుక్రవారం వడదెబ్బకు గురయ్యారు. సారవకోట దగ్గరకు వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో డ్రైవర్ స్థానిక పీహెచ్‌సీ వద్ద బస్సు నిలుపుదల చేశారు. డాక్టర్ సుధారాణి ప్రథమ చికిత్స అందించగా అనంతరం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు.
సొమ్మసిల్లిన ఉపాధి వేతనదారురాలు
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం ఉపాధి పని చేస్తుండగా ఎండవేడిమి తట్టుకోలేక సావిత్రి అనే మహిళ పని సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే క్షేత్ర సహాయకుడు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయం 8 గంటలకే ఉక్కపోతతో పనులు చేయలేకపోతున్నారు. 10 దాటితే బయటికి రావొద్దని హెచ్చరికలున్నా ఉపాధి వేతనదారులకు మాత్రం తప్పడం లేదు. మరోవైపు కొంతమందికి ముఖహాజరు ఇబ్బంది పెట్టడంతో వారు మండుటెండలో గంటలకొద్దీ నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలు నేపథ్యంలో క్షేత్రసహాయకులు పనులు నిలిపివేస్తే వారికి డిమోషన్లు విధిస్తున్నారు. అందుకే ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా పనులు మాత్రం ఆపడం లేదు.


