వజ్రపుకొత్తూరు రూరల్: పల్లిసారధి గ్రామ సచివాలయంలో విద్యుత్ శాఖ జూనియర్ లైన్‌మేన్ (జేఎల్‌ఎం)గా విధులు నిర్వర్తిస్తున్న సీమల సింహాచలంపై అదే గ్రామానికి చెందిన రెయ్యి వాసు దాడికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పల్లిసారధిలో తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి లైట్ వెలగడం లేదన్న విషయమై వాసు గురువారం సచివాలయానికి వెళ్లాడు. అక్కడ గొడవ పడి జూనియర్ లైన్‌మెన్ సింహాచలంపై కర్రతో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే తోటి సిబ్బంది పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బాధితుడి ద్విచక్ర వాహనాన్ని సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వాసుపై కేసు నమోదు చేయాలని బాధితుడు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


