అండర్‌–19 బాలుర హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపికలు రేపు | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 బాలుర హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపికలు రేపు

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అండర్‌–19 బాలుర హ్యాండ్‌బాల జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుంకరి కృష్ణకుమార్‌, ఎమ్మెస్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. 2006 జనవరి ఒకటి తర్వాత జన్మించిన బాలురు అర్హులని స్పష్టంచేశారు. ఎంపికై న జిల్లా జట్టును ఏపీ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్‌క్లాస్‌ జిరాక్స్‌కాపీ, ఆధార్‌కార్డు, ఏడు పాస్‌ఫొటోలతో హాజరై సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ కె.రవిశేఖర్‌ను సంప్రదించాలని కోరారు. వివరాలకు 6304042730 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

జిల్లా క్రికెట్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు చాలా మంది ఉన్నారని.. వారిని మరింతగా ప్రోత్సహించి వెలుగులోకి తీసుకొస్తామని జిల్లా క్రికెట్‌ సంఘం(జెడ్‌సీఎస్‌) నూతన అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. జిల్లా క్రికెట్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా హసన్‌రాజా షేక్‌, ఉపాధ్యక్షుడిగా టి.బాలమురళీకృష్ణ, కోశాధికారిగా మదినా శైలానీ, కౌన్సిలర్‌గా డాక్టర్‌ ఎస్‌.రవికుమార్‌, సంయుక్త కార్యదర్శిగా ఎన్‌జీ బెనర్జీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నికై నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో రవికుమార్‌ మాట్లాడుతూ వారం రోజుల క్రితం జిల్లాలో పాత సంఘం స్థానంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రాతినిధ్యం ఉండేలా చూడా ల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

జి.సిగడాం: ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం ఈ నెల 4న అదృశ్యమై శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. సత్యం ఈ నెల 4 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం వాండ్రంగి–ఆనందపురం గ్రామాల సమీపంలోని మెట్టు ప్రాంతాలో ఉపాధి వేతనదారులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి రాజాం సామాజిక ఆస్పత్రి వైద్యులు కొత్తకోట సీతారామమూర్తి, వీఆర్‌ఓ గోక వెంకటరమణ సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులు అప్పగించినట్లు ఎస్‌ఐ వెలిచేటి సందీప్‌కుమార్‌ తెలిపారు.

పోక్సోకేసు నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష

రణస్థలం: జె.ఆర్‌.పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రామచంద్రపురం గ్రామానికి చెందిన బాలికను మరువాడ పంచాయతీ టెక్కలి గ్రామానికి చెందిన కోనేటి నవీన్‌ అనే వ్యక్తి ప్రేమపేరుతో వేధించినట్లు 2019లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.అశోక్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తదుపరి ఎస్సై ఈ.శ్రీనివాస్‌ చార్జ్‌షీట్‌ నమోదు ఫైల్‌ చేశారు. పబ్లిక్‌ ప్రొసిక్యూటర్‌ వి.ఎస్‌.యు.విశాలాక్షి వాదనలు వినిపించారు. నేరం రుజువైనందున ముద్దాయికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, ఐదు వేల రూపాయలు జరిమానా, మరో సెక్షన్‌లో ఏడాది జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి ఎన్‌.సునీత తీర్పు వెలువరించినట్లు జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement