● నిర్లక్ష్యం వహిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపాటు
పాతపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. హిరమండలం ప్రాజెక్టు పరిశీలనకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉద్దానం ప్రాజెక్టు పథకం విస్తరణ అమలులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వైఖరికి నిరసిస్తూ క్షేత్రస్థాయి పరిశీలనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హిరమండలంలోని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును పరిశీలకు, పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు పనులు చూడడానికి వెళుతుంటే పోలీసులు అంక్షలు విధించారని, హిరమండలం వెళ్లడానికి అడుగడుగునా ఆంక్షలను విధించి అనుమతించలేదన్నారు. తమను, పార్టీ నాయకులను పోలీసులు వెళ్లకుండా నిలుపుదల చేశారన్నారు. ఉద్దానం ప్రజల గొంతు తడపాల్సిన ప్రాజెక్టులపై రాజకీయం చేయడం తగదని, కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఉద్దానం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంధవరపు వెంకటసురేష్, రాష్ట్ర వైఎస్సార్‌టీయూసీ జాయింట్ సెక్రటరీ ఇప్పిలి నారాయణరావు, మెళియాపుట్టి, కొత్తూరు పార్టీ మండల అధ్యక్షులు పోలాకి జయమునిరావు, గండివలస ఆనందరావు, పార్టీ నాయకులు మెండ సింహాచలం, దండుగుల రామారావు, మజ్జి రామయ్య, పొత్తడి మురళీ, జి.పోలయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.


