గార : మండల కేంద్రం గార సమీపంలో ఇసుక తవ్వకాలతో వంశధార నదికి గర్భశోకం తప్పడం లేదు. ఇక్కడ తాగునీటి రక్షిత పథకం సమీపంలోనే భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నదిలోకి పైపులు వేసి రోడ్డు నిర్మించి యంత్రాలతో నేరుగా వాహనాల్లో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం డీసిల్టేషన్ పేరిట ర్యాంపు ఇస్తే ఏకంగా నది గర్భంలోనే 15 నుంచి 20 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. గతంలో వరదల సమయంలో ర్యాంపు ఏరియా నుంచి వమరవల్లి, ఆరంగిపేట, తోనంగి వంటి ప్రాంతాలకు వరద నీరు వెళ్లకుండా రూ. 4 కోట్లతో గాబ్రియన్ గోడను నిర్మించారు. ప్రస్తుత తవ్వకాల వల్ల ఈ గోడకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. గత ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలకు ప్రతీ రోజూ తాగునీరు అందించాలన్న సంకల్పంతో రక్షిత పథకం నిర్మించారు. ఈ ఇన్‌ఫిల్టరేషన్ బావి సమీపంలోనే ఇసుకను తోడేస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు. 500 మీటర్లు వరకు ఎటువంటి తవ్వకాలు జరగకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఫలితంగా 31 గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత నీటి పథకం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నది తీర ప్రాంతంలో 60 వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వాటి పరిధిలో భూగర్భ జలాలకు నష్టం వాటిల్లనుంది. సమీపంలోనే సముద్రం ఉండటంతో ఉప్పునీరు వచ్చి జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
గార ఇసుక ర్యాంపుతో నదికి గర్భశోకం
15 నుంచి 20 అడుగుల మేర యంత్రాలతో తవ్వకాలు
రక్షిత పథకం సమీపంలో భారీ ఎత్తున తవ్వకాలు


