హోటల్లో యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హోటల్లో యువతి ఆత్మహత్య

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్‌కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది.

స్నేహితురాలి ఊరికని చెప్పి..

ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్‌లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్‌లైన్‌లో శ్రీకాకుళం విజేత హోటల్‌లోని రూమ్‌ను బుక్‌ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్‌కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్‌ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్‌ చేసి చెప్పి మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్‌ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్‌ చేయడంతో హోటల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement