ఆదాయం ఫుల్‌.. పర్యవేక్షణ నిల్‌! | - | Sakshi
Sakshi News home page

ఆదాయం ఫుల్‌.. పర్యవేక్షణ నిల్‌!

May 21 2026 12:20 AM | Updated on May 21 2026 12:20 AM

● రెండేళ్లుగా నియామకం కాని రెగ్యులర్‌

జిల్లా రిజిస్ట్రార్‌

● పేరుకుపోతున్న

కక్షిదారుల సమస్యలు

● వారానికోసారి ఇన్‌చార్జి డీఆర్‌ రాక

● పర్యవేక్షణ కరువు

● కానరాని కార్యాలయాల బోర్డులు

రెగ్యులర్‌ రిజిస్ట్రార్‌ వస్తారు..

రెగ్యులర్‌ ప్రాతిపదికన జిల్లా రిజిస్ట్రార్‌ ఓ వారం రోజుల్లో వచ్చే అవకావం ఉంది. ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా చూస్తాం. క్రయ, విక్రయదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. కార్యాలయంలో బోర్డులున్నాయి. లేకుంటే ఏర్పాటు చేస్తాం. – టి.ఉపేంద్రరావు,

జిల్లా రిజిస్ట్రార్‌ (ఎఫ్‌ఏసీ)

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):

ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఒకటి. ఇంతటి కీలకమైన శాఖకు రెండేళ్లుగా రెగ్యులర్‌ అధికారి లేకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న జిల్లా రిజిస్ట్రార్‌ కిల్లి మన్మధరావును విశాఖకు బదిలీ చేశారు. పోనీ ఎవరినైనా రెగ్యులర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ను వేశారా అంటే అదీలేదు. డీఐజీగా పనిచేస్తున్న నాగలక్ష్మిని అటు శ్రీకాకుళం డీఆర్‌గా, పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్‌గా దాదాపుగా 20నెలల పాటు కొనసాగించారు. ఎట్టకేలకు ఫిబ్రవరిలో సబ్‌ రిజిస్ట్రార్‌లకు పదోన్నతులు కల్పించి నెల రోజుల్లో రిటైర్‌మెంట్‌ అయ్యే సి.కుమారస్వామిని కడప నుంచి ఇక్కడ నియమించారు. ఆయన మార్చి చివరి నాటికి పదవీ విరమణ పొందారు. అనంతరం విశాఖపట్నంలో రెగ్యులర్‌గా విధులు నిర్వహిస్తున్న టి.ఉపేంద్రరావును ఎఫ్‌ఏసీ పద్ధతిలో శ్రీకాకుళం వేశారు. ఈయన వారం పది రోజులకు ఒకసారి వస్తుండటంతో ఫైళ్లు, క్రయ విక్రయదారుల సమస్యలు పేరుకుపోతున్నాయి. కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చే ఈ శాఖకు ఉన్నతాధికారులు లేకపోవడంతో సబ్‌ రిజిస్ట్రార్‌లను, కార్యాలయాలను పర్యవేక్షించే వారే కరువయ్యారు. అవినీతిని కట్టడి చేసే వారు లేకపోవడంతో ప్రతి రోజూ ఇక్కడ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వారిదే హవా..

తమ విలువైన భూములు క్రయ, విక్రయాలకు సంబంధించిన సమస్యలు చెబుతామంటే వినే వారే కరువయ్యారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సమస్య వచ్చిన తక్షణమే పరిష్కారం లభించేది. రెగ్యులర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఉండటంతో నిరంతరం కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. సమస్య చెబితే సకాలంలో పరిష్కారమయ్యేది. రెగ్యులర్‌ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు, కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ఏకంగా తమకు అనుకూలంగా నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుని లక్షలాది రూపాయలు క్రయ, విక్రయదారుల వద్ద నుంచి లాగేసి అధికారులతో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు డాక్యుమెంట్‌ వెళ్లడమే తరువాయి.. కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేస్తున్నారని క్రయ, విక్రయదారులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లు తెచ్చిన డాక్యుమెంట్లను మాత్రమే ఎటువంటి పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రిజిస్ట్రేషన్లు అయ్యే డాక్యుమెంట్లు లెక్కకట్టి కిందిస్థాయి ఉద్యోగి సాయంత్రమయ్యే సరికి ఎవరివాటా వారికి చేరవేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తనిఖీ చేసే రెగ్యులర్‌ అధికారులే లేకపోవడం, ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించకపోవడంతో కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు, సిబ్బంది, రైటర్లదే హవా నడుస్తోందని సమాచారం.

బోర్డులేవీ?

డబ్బులు దండిగా వస్తున్నా తమ శాఖకు బోర్డులే అవసరం లేదన్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, జిల్లా కేంద్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు వ్యవహరిసుత్న్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా కనీసం బోర్డు ఉంటుంది. ఇక్కడ మాత్రం క్రయవిక్రయదారులే వెతుక్కుని వస్తారులే అన్న తీరుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు వృద్ధులకు సంబంధించి ఇంటికెళ్లి రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవేవీ కానరావడం లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మొదటి అంతస్తులో ఉండడంతో నడవలేని వృద్ధుల కోసం వీల్‌ చైర్‌ సౌకర్యం అందుబాటులో ఉంచాలి. ఇక్కడ మాత్రం కార్యాలయంలో మూలన ఓ చెత్త కుప్పలో వీల్‌చైర్‌ను పడేసి ఉంచారు. కనీసం వేసవి కాలం కావడంలో తాగునీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం చొరవ చూపి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement