శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నాగావళి నదీ జల కాలుష్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, పి.తేజేశ్వరరావు ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యం నివారించాలని, శ్రీకాకుళం ప్రజల ఆరోగ్యం కాపా డాలని, శ్రీకాకుళం మురికి నీరును శుద్ధిచేసి పైపులైన్ ద్వారా సముద్రానికి పంపించాలని కోరుతూ శని వారం నాగావళి నది కలుషిత జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు జలకాలుష్యాన్ని నివారించి ఎస్టీపీ ప్లాంట్ కట్టేందుకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించా రు. కలుషిత జలాలను తాగడం వల్ల నగరవాసులు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో 11 చోట్ల నుంచి నాగావళి నదిలోకి మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు చేరుతున్నాయని, అవి నీటి ట్యాంకుల వద్దకు చేరడంతో అదే నీరు నగరవాసులకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. నీటి పన్ను, నాలా పన్ను పేరిట రకరకాల పన్నులు వేసి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మంచినీరు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. నదీజల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతాడ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, బి.చిన్నారావు, వెంకటరావు, ప్రవీణ పాల్గొన్నారు.


