● చింతాడ రవికుమార్ ఆరోపణ
ఆమదాలవలస: ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలు జరిగాయని, కూటమి నేతలతో అధికారులు కుమ్మకై ్క పంచాయతీల్లో ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా చేశారని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. అవకతవకలపై ఒక పంచాయతీని తాము క్షుణ్ణంగా పరిశీలించామని, పొందూరు మండలం గోకర్ణపల్లి పంచాయతీలో పరిశీలించి చూస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లో చేర్చారని తెలియజేశారు. ఇవి ఓటర్ల జాబితా తయారీలో అధికారులు అధికార పార్టీ వారికి అనుకూలంగా ఎలా పనిచేశారో తెలియజేస్తున్నాయన్నారు. దీనిపై ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో నాయకులు వారివారి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. అవకతవకలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని, తద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


