బలవంతపు భూసేకరణ ఎందుకు..? | - | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ ఎందుకు..?

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

ధ్వజమెత్తిన వామపక్ష నాయకులు

మందస: కార్గో ఎయిర్‌ పోర్టు పేరుతో బలవంతపు దోపిడీకి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్టు రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని కోరుతూ వామపక్షాల నాయకులు పర్యటన శనివారం చేపట్టారు. అయితే హరిపురంలో కామ్రేడ్‌ మార్పు పద్మనాభం విగ్రహనికి పూలమాలలు వేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామాలకు పర్యటనకు వెళ్తే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు పేరుతో ఉద్దానాన్ని ఊరి తీస్తారా అని ప్రశ్నించారు. సుమారు 5 లక్షల చెట్లును నరికి వేయడం వలన పర్యావరణానికి తీవ్రనష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణ ఆపకుంటే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement