● మూలపేట పోర్టు కోసం భూసేకరణ పేరుతో దోపిడీ
● మండిపడిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కుంభకోణాలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి వైఎస్ జగన్ 70 శాతం పనులు పూర్తిచేశారని, ఇప్పుడు బాబాయ్–అబ్బాయ్‌లు మరో 15 వేల ఎకరాల భూసేకరణ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఉద్యమాల పురిటిగెడ్డలో రైతుల భూములతో ఆడుకుంటే సహించేది లేదని, పీక తెగినా అదనపు భూసేకరణ కానివ్వబోమని హెచ్చరించారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ముసుగులో జరుగుతున్న ఈ దోచుకో.. పంచుకో.. తీసుకో విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి తగిన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయికుమార్, శ్రీకాకుళం ఎంపీపీ అంబటి శ్రీను, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ఎచ్చెర్ల మాజీ జెడ్పీటీసీ సనపల నారాయణరావు, కొత్తూరు మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, టెక్కలి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది సింగుపురం మోహనరావు, కిష్టుపురం మోహనరావు, ఆమదాలవలస మాజీ జెడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు, జిల్లా వైఎస్సార్ సీపీ యువ విభాగం అధ్యక్షులు మార్పు పృధ్వీరాజ్, ద్వారపు అజయ్, సీపాన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


