● పిడుగు పడి తల్లీకూతుళ్ల మృతి
● విషాదంలో మునిగిన పెద్దకేశుపురం
ఆ ఇల్లు ఓ చావు చూసి ఎంతో కాలం కాలేదు. అంతలోనే మృత్యుదేవత మళ్లీ ఆ ఇంటిపై మృత్యుపాశం విసిరింది. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబంపై పిడుగు వేసింది. పెద్ద కేశుపురం గ్రామంలో పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి చెందారు. అచేతనంగా పడి ఉన్న తల్లీకూతుళ్లను చూసి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు.
మందస: నారాయణపురం పంచాయతీ పెద్ద కేశుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి మడియా కృష్ణవేణి(35), మడియా లోకేశ్వరి(చిన్ని)(15) అనే తల్లీకూతుళ్లు మృతి చెందారు. కృష్ణవేణి జీడిపిక్కల బడ్డీకి వెళ్లి జీడి పిక్కలు కటింగ్ చేసుకుంటూ జీవనం గడుపుకునేవారు. ఆమె భర్త సుగర్ వ్యాధి కారణంగా గత ఏడాది డిసెంబర్‌లో చనిపోయారు. అప్ప టి నుంచి మడియా కృష్ణవేణి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె కుమార్తె లోకేశ్వరి ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశారు.
ఆదివారం కృష్ణవేణి ఆవులకు నీరు పెట్టడానికి పశువుల శాలకు వెళ్లారు. ఆమె వెంటే కూ తురు కూడా వెళ్లారు. సరిగా అదే సమయంలో వర్షం ప్రారంభమై హఠాత్తుగా పిడుగు పడింది. ఆ ధాటికి తల్లీ కూతుళ్లు ఉన్న చోటనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే వారికి ప్రాణాలు లేవు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
మడియా లోకేశ్వరి(చిన్ని)
మడియా కృష్ణవేణి


