పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఉదయపురం రామలక్ష్మణ కాలనీకి చెందిన భవన నిర్మాణం కార్మికుడు సత్యం కృష్ణారావు(41) శనివారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలిపాడు వద్ద శ్రీగౌరీ ఇంజినీరింగ్ వర్క్స్ యజమాని చౌదరి ఉపేంద్ర వద్ద వెల్డింగ్ పనులను కృష్ణారావు చేస్తుంటాడు. ఎప్పటి లాగే ఇంటి వద్ద నుంచి శనివారం ఉదయం బయలుదేరి వెళ్లాడు. మొగిలిపాడు దత్తాశ్రయం దారిలో తర్లాన సంజీవరావు బిల్డింగ్ పైఅంతస్తులో రేకులు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాల పాలవడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయాన్ని చౌదరి ఉపేంద్ర ఫోన్ ద్వారా కృష్ణారావు భార్య సత్యం గీతకు తెలియజేశారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా భర్త విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


