హిరమండలం: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిందని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ ఉద్యోగ నియామకాలు అంటూ ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదన్నారు. ఉగాది నాడు మంత్రి లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో తేదీలు తప్ప.. ఉద్యోగాల సంఖ్య వేయకపోవడం హాస్యాస్పదమని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతిని అటకెక్కించారని.. ఉద్యోగాల నోటిఫికేషన్ల ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగాలను కూడా తమ ఖాతాల్లో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని చెప్పారు. 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతను దగా చేశారని.. వచ్చే ఎన్నికల్లో యువత బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.


