సాహిత్యంతో పోరుబాట | - | Sakshi
Sakshi News home page

సాహిత్యంతో పోరుబాట

Mar 22 2026 2:06 AM | Updated on Mar 22 2026 2:06 AM

శ్రీకాకుళం కల్చరల్‌ : సాహిత్యంతోనే పోరుబాట సాగించాలని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని రెడ్‌క్రాస్‌ సమావేశ మందిరంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసం 90 ఏళ్ల ప్రస్తానమని, అటువంటి సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఎంతో మంది అభ్యుదయ కవుల స్ఫూర్తితో సంస్థ సేవలు విస్తృతంగా ఉన్నాయని, ఈ నెల 23, 24 తేదీలలో మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యుదయ వాద సంఘాలన్నీ ఏకతాటిపైకి నిలిచి దేశంలో జరుగుతున్న అరాచకాలపై గళం, కలం ఝుళిపించాలని పిలుపునిచ్చారు. అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా వాసుదేవాచారి గజల్‌ గీతాలు ఆలపించారు.

నూతన కమిటీ ఎన్నిక..

అరసం కమిటీ నూతన జిల్లా గౌరవాధ్యక్షుడిగా చింతాడ కృష్ణారావు, అధ్యక్షుడిగా నల్లి ధర్మారావు, ఉపాధ్యక్షులుగా బెందాళం వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా టి.తిరుపతిరావు, కార్యదర్శులుగా నరేష్‌కుమార్‌, బీవీఎస్‌ రాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌, గేదెల ఇందిరాప్రసాద్‌, వి.జగన్నాథంనాయుడు, కె.శరత్‌చంద్ర, టి.తిరుపతిరావు, సీహెచ్‌ కృష్ణారావు, నరేష్‌, కంచరాన భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు

శ్రీకాకుళం రూరల్‌: రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్‌లో 2025లో ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణత సాధించిన పేద విద్యార్థులకు బీఎస్సీ పారామెడికల్‌ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సును పూర్తి చేసుకొని ఉద్యోగం పొందాక ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీలో న్యూరో ఫిజియాలజీ, డయాలసిస్‌, పెరిఫ్యూజన్‌ రెస్పరేటరీ మెడికల్‌ రికార్డ్స్‌, బ్లడ్‌ హెమటాలజీ టెక్నాలజీ, ఎంఎల్‌టీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నట్లు వివరించారు. 2026లో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని, వివరాలకు 7995013422 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

అంగన్‌వాడీ కేంద్రంలో మంటలు

పలాస: బ్రాహ్మణతర్లా అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు రూ.20వేలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణతర్లా చాకలి వీధిలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్తా చెదారంపై సిగరెట్‌ పీక వేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో రేకుల షెడ్‌లో ఉన్న సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త అగ్నిమాపక, కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎ.ఎస్‌.ఐ సోమేశ్వరరావు, కాశీబుగ్గ హెచ్‌సీ జగన్‌మోహన్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఇంద్ర పుష్కరిణి పనులు ప్రారంభం

శ్రీకాకుళం కల్చరల్‌: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఇంద్ర పుష్కరిణి పనులకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వారు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఈఓ ప్రసాద్‌, అర్చకులు ఇప్పిలి శంకర్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

గెడ్డలో మృతదేహం కలకలం

మందస: డిమిరియా గ్రామ సమీపంలోని గెడ్డలో శనివారం మృతదేహం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా మృతుడు అంబుగాం గ్రామానికి చెందిన గుడియా జగన్నాథరావు(47)గా గుర్తించారు. ఈయన తోపుడు బండిపై తిను బండారాలు అమ్ముకునేవాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement