● నేటి నుంచి మొదలుకానున్న ఇంటర్మీడియెట్ మూల్యాంకనం
● శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా వాల్యుయేషన్
● ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్)కు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల కేంద్రంగా ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఈ మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పలు విడతల్లో జరిగే స్పాట్‌లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ పేపర్ల దిద్దుబాటు చేపట్టనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైన విషయం తెలిసిందే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం పేరిట శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించిన సంగతి తెలిసిందే. స్పాట్‌కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేశారు.
జిల్లాకు చేరిన 2.35 లక్షల పత్రాలు..
శ్రీకాకుళం జిల్లాకు 2.35 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు చేరుకుంటున్నాయి.మూల్యాంకనం మొత్తం వివిధ స్పెల్స్‌లలో జరగనుంది. ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ.709.66 చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్‌స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
అధికారులు, ఎగ్జామినర్ల నియామకం పూర్తి..
స్పాట్ వాల్యుయేషన్‌లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం వెయ్యి మంది వరకు యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. స్పాట్ క్యాంప్ ఆఫీసర్‌గా ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్–1గా గణపతి వెంకటేశ్వరరావు (ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్– జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్–2గా ఎస్.సత్యనారాయణ, సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది.
జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అధికారులు, సిబ్బంది నియామకం పూర్తయింది. నియామక ఉత్తర్వులను కళాశాలల లాగిన్‌లో సిద్ధంగా ఉన్నాయి. విధిగా సమయపాలన పాటించాలి. సీసీ కెమెరాలను అమర్చి, స్ట్రీమింగ్ చేయించాం. బోర్డు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తారు.
– రేగ సురేష్‌కుమార్, డీవీఈఓ/ఆర్‌ఐఓ/ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్, శ్రీకాకుళం


