శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని బుధవారం నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్ (జూడియో బిల్డింగ్ 4వ అంతస్తు)లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విందు కార్యక్రమానికి జిల్లాలోని ముస్లిం మత పెద్దలు, సోదరులందరూ విచ్చేయాలని ఆయన కోరారు.
ఆర్‌హెచ్‌పురంలో
అక్రమంగా గ్రావెల్ తరలింపు
సంతబొమ్మాళి: మండలం ఆర్‌హెచ్‌పురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 191లో ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్నా రెవె న్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జేసీబీ సాయంతో కొండను తవ్వి ట్రాక్టర్ల సాయంతో తరలించుకుని వెళ్లిపోతున్నారు. రోజుకు సుమారు 100లోడులు వరకు తరలించి దూరాన్ని బట్టి రూ.700 నుంచి రూ.1500లు వరకు ట్రాక్టర్ గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. ఈ గ్రావెల్‌ను లేఅవుట్‌లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవె న్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్‌ను అడుగగా గతంలో గ్రావెల్ ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.
కూర్మ గ్రామంలో
శ్రీరామనవమి వేడుకలు
హిరమండలం: వైదిక గ్రామం కూర్మలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 26న యువకులకు ఆధ్యాత్మిక ప్రవచనం, 27న శ్రీరామనవమి వేడుకలు, 28,29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తి వికాస స్వామి ముఖ్య అతిథిగా రానున్నా రని చెప్పారు. మూడు రోజుల పాటు ఆధ్యాత్మి క ప్రవచనం ఇస్తారని తెలిపారు. అన్నదానం కూడా ఉంటుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఇతర వివరాలకు 7732075607 నంబరును సంప్రదించాలని కోరారు.
సివిల్స్ విజేతకు కలెక్టర్ సత్కారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రాము ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కలసి ఘనంగా సత్కరించారు. ఈ అపురూప ఘట్టానికి రాము తల్లి లక్ష్మి కూడా సాక్షిగా నిలిచారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలిసి రాముకు శాలుశా కప్పి, పుష్ప గుచ్ఛం, విలువైన పుస్తకాలను బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తండ్రిని కోల్పోయినా కుంగిపోకుండా ఎన్‌ఐటీ వరంగల్‌లో చదివి, నేడు సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. రాము సాధించిన ర్యాంకుకు ఐపీఎస్ వస్తుందని భావిస్తున్నానని, ఐఏఎస్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఏ విభాగంలో సేవలందించినా జిల్లాకు గర్వకారణమని ఆకాంక్షించారు.
కలెక్టర్ పెద్దమనసు..
సత్కార కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రాము తల్లిని గౌరవిస్తూ, ఆ తల్లీకొడుకులను స్వయంగా కలెక్టర్ కార్యాలయం కింద వరకు తోడ్కొని వెళ్లి, మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.


