ఆశలు ఆవరి..! | - | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవరి..!

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

దారుణం ●

దారుణం

రబీ పంటకు సాగునీటి కష్టాలు

నీరు నిలుపుదల చేసిన అధికారులు

ఆందోళనలో అన్నదాత

సారవకోట: పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు నిలుపుదల చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బద్రి రెవెన్యూ పరిధిలో ఈ ఏడాది రబీలో వంశధార ఎడమ కాలువ కింద 600 ఎకరాల్లో 300 మంది రైతులు వరిపంట సాగు చేస్తున్నారు. అయితే మరో 20 రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్న సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేశారని మంగళవారం రైతులు ఆరోపించారు. ఒక్కో ఎకరా సాగు చేసేందుకు ఇప్పటివరకు రూ.30 వేలు ఖర్చు పెట్టామని, కానీ వంశధార అధికారులు హిరమండలం గొట్టా బ్యారేజీ దగ్గర నుంచి సాగునీరు కాలువ ద్వారా రాకుండా నిలుపుదల చేయడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తీవ్రంగా నష్టపోతాం

నాకున్న 7 ఎకరాలు రబీలో వరిసాగు చేస్తున్నాను. ఏకరాకు రూ.30 వేలు చొప్పున ఇప్పటివరకు ఖర్చు చేశాం. పంట చేతికొచ్చే సమయంలో వంశధార అధికారులు ఇప్పుడు నీరు నిలుపుదల చేస్తే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతాం.

– మెండ సూర్యనారాయణ,

బద్రి, సారవకోట మండలం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు

నాకున్న పొలంతో పాటు కౌలుకు తీసుకుని 12 ఎకరాలు రబీలో సాగు చేస్తున్నాను. పంట పొట్ట దశకు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నాటికి చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేస్తే మా పంటలన్నీ ఎండిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

– యాళ్ల రమణయ్య, బద్రి, సారవకోట మండలం

పనులు చేయించాలి

ఆరుతడి పంటలు వేసుకోవాలని, రబీలో వరి వేయవద్దని గత డిసెంబర్‌లో ఆయకట్టు రైతులకు చెప్పడం జరిగింది. రూ.16 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఆ పనులు ఈ ఏడాది మేలోగా చేయించాలి. అందుకే కాలువ ద్వారా నీటిని మంగళవారం నుంచి నిలుపుదల చేశాం.

– శిమ్మ శ్రీనివాసరావు, డీఈఈ, వంశధార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement