శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు, మేసీ్త్రలు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఒక ప్రాంతంలో డయేరియా ప్రబలితే శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ఎన్.శరత్‌ని బాధ్యులుగా చేస్తూ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులపై అక్రమ తొలగింపు సరికాదని, దీనిపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవచేసుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, అధ్యక్షుడు ఎ.గణేష్, డి.యుగంధర్, ఎం.రాఘవ, ఎ.శంకర్, ఎ.మోహన్, డి.చిట్టిబాబు, ఎ.జ్యోతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


