కంచిలి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తీరుపై ఆదివాసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పురేంద్ర సవర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నువాగడ గ్రామంలో స్థానిక సర్పంచ్ సబితా గొమాంగో ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నకిలీ బెంతో ఒడియా వారికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం మొత్తం ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని, దానికి బాధ్యులు ఎమ్మెల్యే అవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఋషి సవర, డొంబురు, లక్ష్మణ, స్వప్న, కళావతి తదితరులు పాల్గొన్నారు.


