● జాగ్రత్త...
● జిల్లాలో యథేచ్ఛగా వంటనూనెల కల్తీ
● నెయ్యిని సైతం వదలని వైనం
● చోద్యం చూస్తున్న యంత్రాంగం
హిరమండలం: ఇప్పుడు ఏ నోట విన్నా కల్తీ అన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వంట నూనె, నెయ్యి కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కాకినాడ సమీపంలో 870 కిలోల కల్తీ నెయ్యిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదంతా శ్రీకాకుళం జిల్లాలోని ఒక వ్యాపారికి తరలిస్తున్నట్లు పట్టుబడినవారు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జిల్లాలో వంట నూనె, నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకినాడలో దీని మూలాలు తేలడంతో అనుమానాలకు బలం చేకూరింది.
సరిహద్దు ప్రాంతాల్లో..
జిల్లాలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు అధికం. అటువంటి చోట రెండు రాష్ట్రాల బ్రాండ్లు పేరిట కల్తీని చలామణి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా వారికి ఏపీ ఉత్పత్తులుగా.. ఏపీలో ఒడిశా ఉత్పత్తులుగా చూపుతున్నారు. ధర తక్కువగా ఉండడంతో జనాలు నమ్ముతున్నారు. కల్తీ నూనెను కొనుగోలు చేసి చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో కొంతమంది వ్యాపారులు, దళారులు వంటనూనెను యథేచ్ఛగా కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా సన్ ఫ్లవర్, పామాయిల్, రైస్‌బ్రాన్, వేరుశనగ నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అన్నిరకాలు కలిపి నెలకు దాదాపు 1,700 టన్నుల నూనె విక్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా సుమారు రూ.15 కోట్ల నూనె వ్యాపారం జరుగుతుంటుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కువగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే వినియోగిస్తుంటారు. మిగిలిన వాటి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో వీటివైపే మొగ్గుచూపిస్తుంటారు. అయితే వంటనూనెను సైతం కల్తీ చేస్తున్నారు. రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. రంగు పోకుండా ఉండేందుకు మోతాదుకు మించి రసాయనాలు, నిషేధ పదార్థాలను వినియోగిస్తున్నారు. అటువంటి నూనె వాడడం వల్ల ప్రాణాంతాక వ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిబ్బంది లేక ఇబ్బంది
జిల్లాలో వేల టన్నుల వంటనూనె, వేల కిలోల నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. వందల కొద్దీ వ్యాపారులు ఉన్నారు. కానీ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు మాత్రం ముగ్గురే ఉన్నారు. జిల్లా ఆహార భద్రతా అధికారి ఒకరు ఉండగా.. డివిజన్–1, డివిజన్–2 పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. డివిజన్–1 పరిధిలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట న్యాయస్థానాల పరిధిలో తనిఖీ చేయాలి. డివిజన్–2లో ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, పలాస, సోంపేట కోర్టుల పరిధిలో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం నగరంలో చిన్నపాటి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్టుఫుడ్ కేంద్రాలు 500 వరకూ ఉన్నాయి. 30 మండలాల్లో ఆ సంఖ్య 5 వేల వరకూ ఉండొచ్చని ఒక అంచనా. కానీ వీరందరి వద్ద కల్తీ జరగకుండా నియంత్రించే బాధ్యతలో ముగ్గురు అధికారులు ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఫలితంగా ఎక్కడా సక్రమంగా తనిఖీలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
నెయ్యిలో ఇలా..
జిల్లాలో నెయ్యి సైతం కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణంగా నెయ్యిని రెండు రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఇళ్లలో పెరుగు చిలికి వెన్నను తీస్తారు. దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. ఇది 10 నెలలు అయినా నిల్వ ఉంటుంది. అలాగే యంత్రంలో పాలుపోసి మరిగించడం ద్వారా వెన్నను తీయడం రెండో పద్ధతి. దీని నాణ్యత నెల రోజుల తర్వాత తగ్గిపోతుంది. జిల్లాలో రెండో రకం నెయ్యి ఉత్పత్తి, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో వనస్పతి, పామాయిల్ కలిపేసి ఎక్కువ మంది కల్తీ చేస్తున్నారు. జిల్లాలో నెలకు 50 వేల లీటర్ల నెయ్యి విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. రకం, నాణ్యత బట్టి కిలో నెయ్యి రూ.350ల నుంచి రూ.1,000ల వరకూ విక్రయిస్తుంటారు.
తీవ్ర అనారోగ్యం
కల్తీ నూనె, నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యానికి గురవుతారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. మలబద్ధకం, ఒళ్లునొప్పులు, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతుంది. అందుకే ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ముందే మేల్కోవడం ఉత్తమం. – పి.సాయికుమార్
వైద్యాధికారి, పీహెచ్‌సీ, హిరమండలం
ఫిర్యాదు చేయాలి
ఆహార పదార్థాల కల్తీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. జిల్లాలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే 93984 67652 నంబర్‌ను సంప్రదించవచ్చు. తనిఖీలో కల్తీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం.
– సీహెచ్ లక్ష్మీనారాయణ,
ఆహార భద్రతా అధికారి, శ్రీకాకుళం


