కమీషన్ల కక్కుర్తి.. నిలిచిన గిరిజన ప్రగతి..! | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల కక్కుర్తి.. నిలిచిన గిరిజన ప్రగతి..!

Mar 18 2026 7:35 AM | Updated on Mar 18 2026 7:35 AM

● పాతపట్నంలో ముందుకు సాగని అభివృద్ధి పనులు

● కీలక నేతకు ముందుగానే కమీషన్లు చెల్లింపు

● బిల్లుల జాప్యంతో నిలిచిపోయిన పనులు

● అవస్థలు పడుతున్న గిరిజనులు

హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం మండలాల్లో సైతం గిరిజన గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో రహదారులతో పాటు మౌలిక వసతులకు సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు. రోడ్లను చదును చేసి.. మట్టి, గ్రావెల్‌ వేసి వదిలేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, ముందుగానే కీలక ప్రజాప్రతినిధికి 7 శాతం కమీషన్లు ముట్టజెప్పాల్సి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ముందుగానే కమీషన్లు..

2024 సంవత్సరంలో పాతపట్నం నియోజకవర్గానికి మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్ట్‌లు కొందరి చేతుల్లో ఉన్నాయి. వీరంతా ముందుగానే ఒక కీలక నేతకు కమీషన్లు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో వారికి పనులు ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు. వారు కంకర, మట్టితో చదును చేసి కొంతవరకు పనులు పూర్తి చేశారు. అనంతరం బిల్లులు పెట్టుకున్నారు. అయితే బిల్లుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలకు 268 పనులు అప్పట్లో మంజూరయ్యాయి. వాటిలో 123 పనులు పాతపట్నం నియోజకవర్గానికే కేటాయించారు. మొత్తం రూ.109.7 కోట్లకుగాను.. రూ.57.49 కోట్లు పాతపట్నంకే కేటాయింపులు చేశారు. కానీ కమీషన్ల పర్వం, ఆపై బిల్లుల్లో జాప్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

పూర్తయినవి 14 పనులే...

పల్లె పండుగ పనుల విషయంలో సైతం పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలానికి మినహాయించి మిగతా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు మండలాలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో 91 పనులు మంజూరయ్యాయి. అయితే అందులో పూర్తయినవి 14 పనులు మాత్రమే. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కింద పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పనుల మంజూరు కోసం పాతపట్నం నుంచి 1, హిరమండలం నుంచి 21, ఎల్‌ఎన్‌పేట నుంచి 10 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 11 అసలు ప్రారంభించలేదు. 21 వివిధ దశల్లో ఉన్నాయి. అసలు కొత్తూరు, మెళియాపుట్టిల నుంచి ప్రతిపాదనలే రాలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పల్లెపండుగ–1లో పనులకే ఇంతవరకూ మోక్షం లేకపోవడమే. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇంతవరకూ గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పల్లెపండుగ పనుల్లో కమీషన్ల పర్వంపై అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. దీనిపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement