లేదంటే కరెంట్ కట్!
హిరమండలం: కరెంట్ కావాలంటే ఇక నుంచి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అలా చేసుకుంటేనే ఇంటిలో బల్బులు వెలుగుతాయి. లేదంటే చీకటే. ప్రస్తుతం కరెంటు బిల్లు కట్టేందుకు కొన్ని రోజులు గడువు ఉంది. అది దాటినా అపరాధ రుసుంతో కలిసి కట్టేయవచ్చు. కానీ ఇంటి బయట స్మార్ట్ మీటర్ వచ్చి గోడకు వాలిందంటే.. ఆ సదుపాయాలన్నీ ఆగిపోతాయి. సెల్‌ఫోన్, డీటీహెచ్ మాదిరిగా వినియోగించిన మేర ముందుగానే రీచార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా స్మార్ట్‌మీటర్ల అమరిక ప్రారంభమైంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 8 లక్షల వరకూ ఉన్నాయి. ఇందులో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే విద్యుత్ వృథాను నియంత్రించేందుకు స్మార్ట్‌మీటర్లు అమర్చుతున్నట్టు కేంద్ర ప్రభు త్వం చెబుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఉచిత విద్యుత్ అందించే వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చుతామంటే కూటమి వ్యతిరేకించింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్లు బిగిస్తోంది. దీనిపై ప్రజలతో పాటు ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే గృహ వినియోగానికి సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా అమర్చాలని నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో 62,866 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చినట్టు తెలుస్తోంది.
ఇలా చేస్తారు..
స్మార్ట్ మీటర్లుగా పిలిచే ప్రీ పెయిడ్ మీటర్లు ప్రతినెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లులను పరిగణనలోకి తీసుకొని విద్యుత్ వినియోగంపై ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే రీచార్జీకి సంబంధించి వినియోగదారుడికి అలెర్ట్ మెసేజ్ వస్తుంది. అంతకు ముందు రీచార్జీ విలువ? ఎంత విద్యుత్ వినియోగించారు? ఇంకా ఎంత రీ చార్జ్ చేయాల్సి ఉంటుంది? అనేది ఆ మెసేజ్‌లో స్పష్టంగా పొందుపరచి ఉంటుంది. తద్వారా తదుపరి నెలలో విద్యుత్ వినియోగంపై ఒక అవగాహన వస్తుంది. ఒక వేళ రీచార్జీ చేయడం ఆలస్యమైతే మాత్రం ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జీ చేసుకున్న తర్వాతే సరఫరాను పునరుద్ధరిస్తారు. ఇందు కోసం స్మార్ట్‌మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుచేసి తమ సిబ్బందితో మానటరింగ్ చేస్తుంటుంది.
ప్రజల్లో భయాందోళనలు..
స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు ఉన్నాయి. ఇదే కూటమి గతంలో స్మార్ట్ మీటర్లపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించాల ని చెబుతుండడంతో ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విద్యుత్ వృథాను అరికట్టేందుకేనని చెబు తున్నా ఎవరూ నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులకు సంబంధించి స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అన్నిరకాల ప్రభు త్వ కార్యాలయాలు సుమారుగా 15 వేలు ఉన్నాయి. ఇప్పటికే సగానికిపైగా కార్యాలయాలకు అమర్చారు. 32 శాఖలకు సంబంధించి కార్యాలయాలకు, గ్రామ పంచాయతీలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు స్మార్ట్ మీటర్ల అమరిక వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
జిల్లాలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
రీచార్జి చేసుకుంటేనే విద్యుత్
బలవంతం కాదంటూనే బిగింపులు
ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో..


