● ఆలస్యంగా వెలుగులోకి...
శ్రీకాకుళం: జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న కిషోర్ కుమార్ అనే యువకుడు పని ఒత్తిడితో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఈ సంఘటన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సెలవు అయినప్పటికీ పన్నుల వసూళ్లు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పని ఉండడం వల్ల తప్పక రావాల్సిందేనని చెప్పడంతో కిషోర్ కుమార్ కార్యాలయానికి వచ్చారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఈయన ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో మిగిలిన ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పంచాయతీ అధికారి పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేయడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. కిషోర్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అదుపు తప్పిన కారు
నరసన్నపేట: స్థానిక సత్యవరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఒడిశాకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అయితే కారులో ప్రయాణిస్తున్న సురేష్‌కుమార్ సాహుతో పాటు మరో నలుగురు వ్యక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఈ కారు నరసన్నపేట వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. డివైడర్‌పై ఉన్న ఐరెన్ రాడ్లును ఈడ్చుకుంటూ కొంతదూరం వెళ్లి రివర్స్‌లో డివైడర్‌పై ఆగింది. కారు ముందరి భాగం పూర్తిగా నుజ్జు అయింది. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే కారులో ఉన్న అందరూ సీటుబెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని సురేష్ కుమార్ తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ బి.గణేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఉపాధ్యాయుల పదోన్నతులకు అవకాశాలు
శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర పాఠశాలల విద్యాసంచాలకుల ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో ఎ.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌లో ఉన్న పదోన్నతుల తాత్కాలిక సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీకాకుళం కార్యాలయంలో తగిన ధ్రువీకరణ పత్రాలు ఆధారాలతో సమర్పించాలని కోరారు.


