ఒకేసారి మూడు బ్యాంకు కొలువులు | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు బ్యాంకు కొలువులు

Mar 16 2026 7:20 AM | Updated on Mar 16 2026 7:20 AM

వజ్రపుకొత్తూరు రూరల్‌: పొల్లాడ గ్రామంలోని సామాన్య కుటుంబానికి చెందిన బంగారు సందీప్‌ అనే యువకుడు ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించాడు. కర్ణాటక రీజనల్‌ రూరల్‌ బ్యాంక్‌ పీఓ, ఐబీపీఎస్‌ క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ కొలువులను సాధించి సత్తా చాటాడు. సందీప్‌ తల్లిదండ్రులు ప్రభావతి, వాసుదేవరావులు సామాన్య కుటుంబానికి చెందిన వారు. సోదరి లావణ్య యూకో బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పట్టుదలతో చదివి ఏకకాలంలో మూడు బ్యాంక్‌ ఉద్యోగాలు సాధించిన సందీప్‌ను గ్రామస్తులు అభినందించారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

శ్రీకాకుళం కల్చరల్‌ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిత్యాన్నదాన పథకానికి శ్రీకాకుళంకు చెందిన అన్నెపు సూర్యనారాయణ, వైకుంఠమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నెపు రమేష్‌ ఆదివారం రూ.లక్ష నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌కు అందజేశారు. దాతను వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

అమరజీవి జయంతి వేడుకలు విజయవంతం చేయండి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం పాతబస్టాండ్‌ వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య వాసవి దళ్‌ చైర్మన్‌ మండవిల్లి రవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్యవైశ్య కులస్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ

శ్రీకాకుళం కల్చరల్‌ : ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆది వారం భక్తులు పోటెత్తారు. టికెట్ల రూపంలో రూ.3,50,300, పూజలు, విరాళాల రూపంలో రూ.70,634, ప్రసాదాల రూపంలో రూ.1,83, 690, దర్శనం, సూర్యనమస్కారాలు, వివిధ సేవలు, ప్రసాదాల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ద్వారా రూ.59,900 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌ తెలిపారు.

జాగిలాలతో తనిఖీలు

శ్రీకాకుళం క్రైమ్‌ : గంజాయి, అక్రమ మద్యం, ఇతర మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, రవాణాను అరికట్టేందుకు ఆదివారం నగర పరిధిలో పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. రెండో పట్టణ ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్‌కాంప్లెక్సు ఆవరణలో అనుమానాస్పద ప్రదేశాలు, సమీప పార్సిల్‌ సర్వీసులు, దుకాణాలు, ప్రయివేటు ట్రావెల్స్‌ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

మహోన్నత గ్రంథాలు రామాయణ భగవద్గీతలు

శ్రీకాకుళం కల్చరల్‌ : నగరంలోని ఉపనిషన్మందిరంలో ఆదివారం ‘శ్రీమద్రామాయణం – శ్రీమద్భగవద్గీత సమన్వయం’ అనే అంశంపై నిష్టల నరసింహమూర్తి ప్రసంగించారు. మహర్షులు, మహాకవులు ఎంతమంది ఉన్నా అగ్ర తాంబూలం వ్యాస, వాల్మీకులకే దక్కుతుందన్నారు. అనంతరం పలు శ్లోకాల గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో మందిరం సభ్యులు నారాయణమూర్తి, కామేశ్వరరావు, పట్నాయక్‌, ఈశ్వరరావు, జోగారావు, సూరిబాబు, బాబూరావు, ఈశ్వరరావు, వెంకటరమణ, చంఽద్రరావు, బాలరాజు, అరుణ, లక్ష్మి, భారతి, ఉమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement