ప్రశ్నిస్తేనే మోసాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తేనే మోసాలకు అడ్డుకట్ట

Mar 16 2026 7:20 AM | Updated on Mar 16 2026 7:20 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినప్పుడే అక్రమ వ్యాపారుల్లో భయం కలుగుతుందని, తద్వారా మోసాలను నివారించవచ్చని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం– 2026’ నిర్వహించారు. ‘సురక్షితమైన ఉత్పత్తులు – విశ్వసనీయ వినియోగదారులు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వినియోగదారులు కేవలం ఫిర్యాదులు చేసి వదిలేయకుండా,అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకోవాలని, అప్పుడే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. ఏ వస్తువు కొన్నా అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలన్నారు. కొనుగోలు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరిస్తే సగం సమస్యలు దరిచేరవని స్పష్టం చేశారు. గత ఏడాది వ్యవధిలో కమిషన్‌కు 500కుపైగా ఫిర్యాదులు రాగా, విచారణ చేపట్టి 450కి పైగా కేసుల్లో వినియోగదారులకు న్యాయం చేశామని చెప్పారు. హక్కుల పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కాగా, సదస్సు ప్రాంగణంలో తూనికలు–కొలతలు, ఆహార కల్తీ నియంత్రణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పాలలో కల్తీని గుర్తించడం, నిత్యావసర వస్తువుల్లో కల్తీని కనిపెట్టే పద్ధతులు, తూనికల్లో జరిగే మోసాలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి జి.సూర్యప్రకాశరావు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు, లీగల్‌ మెట్రోలజీ సహాయ నియంత్రణాధికారి పి.చిన్నమ్మ, డ్రగ్స్‌ కంట్రోల్‌ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ చౌదరి లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అనిత, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త వై.సురేంద్ర బాబు, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్‌ చంద్రకళ, బీపీసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ యండూరి అన్విత, ఆసరా జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ గంజి ఆర్‌.ఎజ్రా, పౌరసరఫరాల శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement