● ఇప్పట్లో రావడం అనుమానమే
● ఉన్నతాధికారుల ప్రకటనతో మూత దిశగా రెస్టారెంట్లు
శ్రీకాకుళం : జిల్లాలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జాయింట్ కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గృహావసరాలకు వినియోగించే సిలిండర్లకు కొరత లేదని చెబుతూ వాణిజ్యపరమైన సిలిండర్ల సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, కమిటీ నిర్ణయం మేరకు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. అసలు ఆ కమిటీ నివేదిక ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కమిటీ సిఫారసుల తర్వాతే వాణిజ్యపరమైన సిలిండర్లు సరఫరా చేస్తామని మాత్రం చెబుతున్నారు. అంటే ఇప్పట్లో వాణిజ్యపరమైన సిలిండర్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలకు మాత్రంగృహ అవసర సిలిండర్లు సరఫరా చేస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన కేవలం రెస్టారెంట్లు, హోటళ్లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 25 శాతం రెస్టారెంట్లు మూతపడగా, మిగిలినవి కూడా ఒకటి రెండు రోజుల్లో గ్యాస్ లేక మూతపడే దిశగా పయనిస్తున్నాయి. హోటల్లు మూతపడినప్పటికీ కరెంట్ బిల్లులు, సిబ్బందికి జీతభత్యాలు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. చాలావరకు బ్యాంకు రుణాలతో హోటళ్లు, రెస్టారెంట్లను ప్రారంభించడం వల్ల వాటి ఈఎంఐలు ఎలా కట్టాలి అన్న మనోవేదనతో యాజమాన్యాలు ఉన్నాయి. అయినప్పటికీ విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక లోలోనే మదన పడుతున్నారు. ప్రభుత్వాలు ఆలోచన చేసి హోటల్ రంగాన్ని నిలదొక్కుకునేలా చూడాలని పలువురు కోరుతున్నారు.


