మెళియాపుట్టి:పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకుడు పొట్టకూటికి చైన్నె వెళ్లి మృత్యువాత పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బమ్మిడి చంద్రశేఖర్ కొంతకాలంగా చైన్నెలో భవన నిర్మాణ పనుల్లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం విధులు నిర్వర్తిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చంద్రశేఖర్‌కి భార్య రేఖ, కుమార్తెలు భూమిక, వామాక్షి ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: హిరమండలంలోని గిరిజాల వీధిలో నివాసముంటున్న తోలేటి భానుమూర్తి (55) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన స్థానిక జ్యుయలరీ షాపులో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకి వివాహం జరగ్గా, కుమారుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల కిందట భార్య విశాఖలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. భానుమూర్తి ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భానుమూర్తికి కుమార్తె ఫోన్ చేసింది. కలవకపోయేసరికి వీధిలో ఉన్న వారికి ఫోన్ చేసింది. వారు వచ్చి ఇంట్లో తలుపులు తెరిచేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని భానుమూర్తి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుమార్తెతో పాటు భార్యకు సమాచారం అందించగా వారు వచ్చారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. భానుమూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.


