చిరుధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్
ఆమదాలవలస: చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన చిరుధాన్యాల సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వృత్తి శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. దీంతో శిక్షణ పొందిన రైతులకు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో పాల్గొనేవారు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిబసు మాట్లాడుతూ మేజర్ మిల్లెట్స్ సాగు విధానం, వాటికున్న డిమాండ్‌ను వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత మాట్లాడుతూ చిరుధాన్యాలు పోషక విలువలు కలిగి ఉంటాయన్నారు. రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, డాక్టర్ జీఎస్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.


